పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/215

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

212

చర్చించారు. ఆయన మీద బ్రిటిష్‌ పోలీసుల కన్ను పడింది. ఆయనను అరెస్టు చేయగా అమెరికన్‌ నావికుల ప్రమేయంతో బయటపడి తిన్నగా అమెరికా చేరుకున్నారు. అమెరికా చేరుకోగానే కార్మికుల అనుకూల సంస్ధ అమెరికన్‌ వర్కర్స్‌ పార్టీలోసభ్యత్వం స్వీకరించి, ఆ పార్టీ సహకారంతో రష్యా వెళ్ళారు. అక్కడ కమ్యూనిజాన్ని అధ్యయనం చేస్తూ గడిపిన ఆయన బ్రిటిష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న స్వదేశీయులతో కలసి సామ్రాజ్యవాద శక్తులను ఎదుర్కొవాలన్న నిర్ణయానికొచ్చారు.

ఆ సమయంలో భారతదేశంలో ఉప్పుసత్యాగ్రహం జరుగుతుంది. ఆ ఉద్యమం లో పాల్గొనేందుకు మాస్కో నుండి 1930 చివరి భాగంలో భారత దేశానికి వచ్చారు. అప్పటికే ప్రమాదాకర వ్యక్తుల జాబితాలో చేరిన ఆయన కోసం పోలీసులు వేట ఆరంభించగా వారికి చిక్కకుండా మారువేషంలో బొంబాయి నుండి మద్రాస్‌కు చేరుకున్నారు. మద్రాసు కేంద్రంగా దక్షిణ భారత దేశంలో కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిర్మించేందుకు నడుంకట్టారు. ఆ క్రమంలో జాతీయ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని సత్యాగ్రహ ఉద్యమంలో జైలుకు వెళ్లిన యువకులు, విద్యార్థుల కోసం అంవేషిస్తూన్న ఆయనకు కంభంపాటి సత్యనారాయణ, పుచ్చలపల్లి సుందరయ్య తారసపడ్డారు. ఆ యువకులను అమీర్‌ హెదర్‌ ఖాన్‌ స్వయంగా కలుసుకుని వారికి కమ్యూనిస్టు ఉద్యమాన్ని పరిచయం చేశారు.

అటు జాతీయోద్యమ కార్యక్రమాలు, ఇటు కమ్యూనిస్టు పార్టీ నిర్మాణ కార్య కలాపాలలో నిమగ్నమైన అమీర్‌ హైదర్‌ ఖాన్‌ను 'అత్యంత ప్రమాదాకారి'గా పరిగణంచిన బ్రిటిష్‌ ప్రభుత్వం ఆయనను పలుమార్లు జైళ్ళ పాల్జేసింది. ఒకసారి ఆయన జైలులో ఉన్నప్పుడు సుభాష్‌ చంద్ర బోస్‌తో పరిచయం కలిగింది. ఆ పరిచయం వారి మధ్యన స్నేహంగా మారింది. బ్రిటిష్‌ పాలకుల కళ్ళుగప్పి నేతాజీ జపాన్‌ వెళ్ళినప్పుడు అమీర్‌ హైదర్‌ ఖాన్‌తో నేతాజీకి ఏర్పడిన ఆ స్నేహం ఎంతగానో సహకరించింది.

దక్షిణ భారతదేశంలో తన కార్యక్రమాలను ముగించుకున్న అమీర్‌ హైదర్‌ ఖాన్‌ 1945లో స్వస్థలానికి వెళ్ళిపోయారు. స్వగ్రామంలో బ్రిటిష్‌ వ్యతిరేక పోరాటాలలో పాల్గొంటూ వచ్చిన ఆయన స్వరాజ్యం వచ్చాక పూర్తిగా జన్మభూమి సేవలో గడిపారు. 1988లో భారతదేశం వచ్చి కమ్యూనిస్టు మిత్రులను కలుసుకుని దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్ట్‌ ఉద్యమం వికసించిన తీరు తెన్నులను తెలుసుకుని ఆనందించారు. ఆ తరువాత 1992లో మరోసారి భారతదేశం వచ్చి వెళ్ళిన అవిశ్రాంత పోరాట యోధులు అమీర్‌ హైదార్‌ఖాన్‌ 1999లో తన స్వగ్రామంలో చివరి శ్వాస విడిచారు.

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌