పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/213

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

210 ముస్లిం మహిళలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని చరిత్ర సృష్టించారు.

మణిపూరులో ఉపాధికి అవకాశాలు లేకపోవటంలో బ్రతుకుదెరువు వెతుక్కొంటూ అస్సాంలోని జోర్‌హ్‌కు వెళ్ళిన అహమ్మద్‌ 1941 ఆరంభంలో బ్రిటిష్‌ ఇండియా ఆర్మీలో చేరారు. ఆ తరువాత జపాన్‌ బ్రిటిష్‌ ప్రాంతాల మీద దాడి చేసి, విజయం సాధించటంతో బ్రిటిష్‌ సైన్యంలోని భారతీయులు యుద్ధ ఖైదీలయ్యారు. ఆ యుద్ధఖైదీలు క్రమంగా నేతాజీ నాయకత్వంలోని భారత జాతీయ సైన్యంలో భాగమయ్యారు. ఈ సందర్బంగా నక్కీ అహమ్మద్‌లో గల ధైర్య సాహసాలు, కార్యదక్షతను గమనించిన నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ స్వయంగా ఆయనకు ప్రత్యేక బాధ్యతలను అప్పగించారు.

రణ దుందుబి మోగిస్తూ ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ బయలు దేరిన మార్గంలో అందరి కంటే ముందుగా ఆ స్థానాలకు చేరుకుని ఆ ప్రాంతాలలోని ప్రజలతో సత్సంబంధాలను ఏర్పరచుకుని శత్రువును ఎదుర్కొనేందుకు ప్రజలను సిద్ధం చేసి ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ వీర పుత్రులకు అనుకూల వాతావరణం ఏర్పచడంలో నక్కీ అహమ్మద్‌ సమర్దవంతంగా విధులను నిర్వహించి శభాష్‌ అన్పించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు 'మేజర్‌' గా పదోన్నతిని కూడా లభించింది. ఆ తరువాత సాగిన ప్రతికూల పరిణామాల ఫలితంగా బ్రిటిష్‌ గూఢచారులు ఆయనను అరెస్టు చేశారు. ఆ సందర్బంగా జరిగిన ఇంటరాగేషనలో ఒక ఆంగ్లేయాధికారికొట్టిన చెంపదెబ్బకు ఆయన గూబ పగిలి పోవడంతో ఒక చెవి పూర్తిగా పనికిరాకుండ పోయింది.

చివరకు భారత జాతీయ కాంగ్రెస్‌ కృషి, సైనిక న్యాయస్థానంలో సాగిన విచారణ ఫలితాలు అనుకూలించడంతో 1946 మే మాసంలో నక్కీ అహమ్మద్‌ చౌదరీ స్వగృహం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతానికి చెందిన ప్రముఖుడు ఉన్నతాసనం నుండి దిగి వచ్చి ఆయనకు గౌరవంగా సెల్యూట్ చేసి స్వాగతం పలకడం సంచలనం సృషించింది. అ ప్రాంతంలో అప్పటివరకు మరెే ముస్లిం ప్రముఖునికి అంతటి గౌరవం లభించక పోవటం ఈ సంఘటన చరిత్ర సృష్టించింది.

మేజర్‌ నక్కీ అహమ్మద్‌చౌదారీ బ్రతుకుదెరువు కోసం స్వగ్రామంలో పలు ఉద్యోగాలు చేశారు. ఆయన ఎక్కడ ఉన్నా ఆనాటి ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ వీరుల త్యాగాలను సాహసాలను బాలబాలికలకు వివరిస్తూ యోధుల అపూర్వ ఆత్మబలిదానాలతో లభించిన స్వేచ్ఛా- స్వాతంత్య్రాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యతలను యువకులకు గుర్తు చేస్తూ గడపారు. ఈ విధంగా చివరివరకు గడిపిన ఆజాద్‌ హింద్‌ ఫొజ్‌ యోధులు నక్కీ అహమ్మద్‌ చౌదరీ 82 ఏండ్ల వయస్సులో 1996 డిసెంబరు 6న ఆఖరిశ్వాస విడిచారు.

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌