పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/201

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

198

అందరికి ఆదర్శమయ్యారు. ఈ సందర్భంగా గాంధీజీకి లేఖ రాస్తూ అందులో 'నా భర్త సహచరులంతా జైళ్ళకు వెళ్ళారు. నా భర్త మాత్రం ఇంత వరకు స్వేచ్ఛగా ఉండటం పట్ల మాకు బాధాగా ఉంది' అని పేర్కొన్నారు. 'మహనీయురాలైన ప్రతిష్టాత్మక ధర్మపత్ని' శీర్షికతో మహాత్మా గాంధీ స్వయంగా రాసిన వ్యాసంలో ఆమె గురించి ప్రస్తావిస్తూ అన్ని సుఖభోగాలను వదలి సాదాసీదా ఉద్యమ కార్యకర్త జీవితాన్ని చేపట్టిన వైనం, జాతీయోద్యమ లక్ష్యాల పట్ల ఆమెలో ఉన్న నిబద్ధతలను వివరిస్తూ ప్రశంసించారు.

జాతీయ విశ్వవిద్యాలయం 'జామియా మిలియా ఇస్లామియా' కులపతిగా బాధ్యతలు నిర్వహిస్తున్న భర్తను పోలీసులు అరెస్టు చేయగా 'నా భర్త గైర్హాజరీలో జామియా మిలియా ఇస్లామియా (అలీఘర్‌) కార్యకలాపాల బాధ్యతలనన్నింటినీ నిర్వహించేందుకు నేను కృషి చేస్తాను' అని ఆమె గాంధీజీకి లేఖ రాశారు. ఈ మేరకు ప్రబుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటూ ఆమె జామియా మిలియా ఇస్లామియా కార్యకలాపాలను పర్యవేక్షించారు.

మహిళల్లో విద్యా ఆవశ్యకతను గ్రహించిన ఆమె, ఆ దిశగా చాలా శ్రద్ధచూపారు. మహిళలు విద్యావంతులైతే తప్ప సమాజ పురోగతి సాధ్యం కాదని ప్రకటించారు. జాతీయోద్యమం విజయవంతం కావాలంటే మహిళల్లో చైతన్యం రావాలనీ అది అక్షర జ్ఞానం ద్వారా మాత్రమే సాధ్యమౌతుందని ఆమె గట్టిగా విశ్వసించారు. ఈ మేరకు తన విశ్వాసాన్ని ఆచరణలో చూపేందుకు ఎంతగానో శ్రమించారు. ప్రజలలో అక్షర జ్ఞానం కల్గించేందుకు ప్రచార కార్యక్రమాల కంటే విద్యా వ్యవస్థల నిర్మాణం ద్వారా ఆ లక్ష్యాలు సాధ్యనమౌతాయని భావించిన ఆమె 1930లో అలహాబాద్‌లో ఆడపిల్లలు, మహిళల కోసం హమీదియా బాలికల సెకండరీ స్కూల్‌ స్థాపించారు.

ఖద్దరు ప్రచార కార్యక్రమాలలో ఆమె అత్యంత ఆసక్తి చూపారు. స్వయంగా ఖద్దరు ధారణ చేశారు. ఆశయాలను ఆచరణలో చూపటం ద్వారా ప్రజలను విశేషంగా ఆకర్షించారు. నూలు వడకటం మాత్రమే కాకుండా, నూలువడకడాన్ని ప్రజలకు ప్రధానంగా మహిళలకు, యువతులకు స్వయంగా నేర్పారు.

మాతృభూమి విముక్తి కోసం ఉద్యమించిన ఫలితంగా బ్రిటిష్‌ సామ్రాజ్య వాదుల నుండి దేశానికి విముక్తి లభించినప్పటికీ, దేశం విభజనకు గురవటం పట్ల కుంగిపోయిన

బేగం ఖుర్షీద్‌ రాజకీయాలకు దూరమైవిద్య, సామాజిక సేవారంగాలకు అంకితమయ్యారు.

అటు మాతృభూమి సేవ, ఇటు ప్రజాసేవకు అమూల్యమెన జీవితాన్ని పూర్తిగా అర్పించిన బేగం ఖుర్షీద్‌ ఖ్వాజా 1981 జులైలో తుదిశ్వాస విడిచారు.

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌