పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

180

అవుతున్నాయి. ఆ కట్టుబాట్లను కాదంటూ జాతీయోద్యమంలో ఆమె ప్రవేశించారు. ఖిలాఫత్‌-సహాయనిరాకరణ ఉద్యమంలో ఆమె చురుగ్గా పాల్గొన్నారు. విదేశీ వస్తు బహిష్కరణ సందర్భంగా అత్యంత విలువైన తన పెళ్ళినాటి వస్త్రాలను విసర్జించటమే కాక విదేశీ వస్తు విక్రయశాలల ఎదుట జరిగిన పికెటింగ్ తదితర కార్యక్రమాలలో ఆమె ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఆ కార్యక్రమాలలో సరోజినీ నాయుడు తదితరులతో కలసి క్రియాశీలకంగా వ్యవహరించి పోలీసుల లాఠీ దెబ్బలను రుచి చూశారు.

జాతీయోద్యమ కార్యక్రమాలలో చురుకైన భాగస్వామ్యాన్ని అందించటం, నిరంతరం ఆ కార్యకలాపాలలో మునిగితేలడం స్వజనులకు రుచించలేదు. చివరకు వస్త్రధారణ విషయంలో కూడా సంబంధీకుల నుండి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొవాల్సి వచ్చింది. సౌకర్యంగా ఉంటాయన్న ఉద్దేశ్యంతో ఆమె ఖద్దరు చుడీదార్‌-కుర్తాలను ధరించారు. వితంతువులు అలాంటి వస్త్రధారణ చేయరాదని సాంప్రదాయవాదులు విమర్శించారు. అంగాంగ ప్రదర్శన లేని సభ్యతగల వస్త్రధారణ ఏమాత్రం అభ్యంతరకరం కానవసరం లేదంటూ ఆమె ఆ విమర్శలను తోసిపుచ్చి ధైర్యంగా ముందుకుసాగారు.

ఖిలాఫత్‌ నిధులకోసం ఆబాదిబానో బేగం లక్నోకు వచ్చిన సందర్భంగా సుగరా ఖాతూన్‌ ఆమెకు ఎంతగానో సహకరించారు. ఖిలాఫత్‌ ఫండ్‌ కోసం తన వద్దనున్న పెళ్ళినాటి 50తులాల బంగారాన్ని, అత్యంత విలువైన వజ్రాలను విరాళంగా సమర్పించారు. ఈ సందర్భంగా మహిళలను ఉద్దేశించి ఆమె ఉత్తేజపూరిత ప్రసంగం చేసి సభికులను ప్రభావితులను చేశారు. ఆమె ప్రసంగం తరువాత మహిళలు పెద్ద సంఖ్యలో ముందుకు వచ్చి భారీ ఎత్తున నిధులు సమకూర్చిన సంఘటన నగరంలో చర్చ నీయాంశం అయ్యింది.

సుగరా ఖాతూన్‌ నిరంతర అధ్యయనశీలి. ఆమె రాసిన ఆలోచనాత్మక వ్యాసాలు, కవితలు హందర్ద్‌, జమిందార్‌, హందం లాంటి ప్రముఖ ఉర్దూ పత్రికలలో ప్రచురితమై సంచలనం సృష్టించాయి. ఆమె పలు నవలలు రాసి, వాటి ద్వారా తన అభిప్రాయాలను నిర్బయంగా ప్రకటించి, ఆ గ్రంథాలను ప్రచురించి మంచి రచయిత్రిగా ఖ్యాతి గడించారు.

సుగరా ఖాతూన్‌ క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభ దశలో చాలా చురుగ్గా పాల్గొన్నా ఆ తరువాత కుటుంబ సమస్యల కారణంగా పలుమార్లు హెదారాబాద్‌ పర్యటనలు జరపాల్సి రావటంతో జాతీయోద్యమంలో కోరుకున్న రీతిగా పూర్తి స్థాయిలో పాల్గొనలేక పోయారు. భారతదశ స్వతంత్ర భానుడు ఉదయించాక ఆమె హెదారాబాద్‌ నుండి లక్నోవెళ్ళిపోయారు. ఆ తరువాత జాతి పునర్మాణంలో భాగం పంచుకుంటూ, ప్రజాసేవలో నిరంతరం గడిపిన సుగరా ఖాతూన్‌ 1968 మే 10న తనువు చాలించారు.

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌