పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

154

పూర్తికాలపు కార్యకర్తగా జాతీయోద్యమంలో ప్రవేశించారు. ఆనాటి నుండి జాతీయ కాంగ్రెస్‌ కార్యక్రమాలన్నిటిలోనూ, తనదైన పాత్ర నిర్వహించారు. డిలీలో జరిగిన ఉద్యమ ప్రచార కార్యక్రమాలలో పాల్గొని 18 మాసాల పాటు జైలుశిక్ష అనుభవించారు. 1924 నాటి ఆల్‌ ఇండియా ముస్లిం లీగ్ సమావేశంలో పాల్గొని 'స్వరాజ్యం' ప్రతిపాదన తీర్మానంగా రూపుదిద్దుకునేలా తోడ్పడ్డారు. 'భారత ప్రభుత్వం చట్టం 1919' స్థానంలో నూతన రాజ్యాంగం రచన కోసం ఏర్పడిన కమిటీలో సభ్యునిగా ఆసఫ్‌ అలీ తనదైన భాగస్వామ్యాన్నిఅందించారు.

మత తత్వానికి వ్యతిరేకంగా చివరివరకు రాజీలేని పోరాటం సాగించిన ఆయన మతతత్వాన్ని రచ్చగొట్టి, మత మనోభావాల ఆధారంగా భారత విభజనకు పురికొల్పుతున్న రాజకీయ వాదులను ఆసఫ్అలీ క్షమించలేదు .ఆనాడు ముస్లిం నాయకులలో అగ్రగణ్యుడిగా ప్రకాశిస్తున్న జిన్నాను రాజకీయంగా ఎదుర్కొవడానికి వెనుకాడలేదు.

జాతీయ కాంగ్రెస్‌ సభ్యునిగా ఆసఫ్‌ అలీ అనేక పదవులను నిర్వహించారు. పలు నిజనిర్ధారణ కమిటీలలో సభ్యులుగా బాధ్యతలు చేపట్టారు. ఏ బాధ్యత చేపట్టినా తన కార్యదక్షతతో నిర్విఘ్నంగా కార్యక్రమాలను నిర్వహించడం ఆయన ప్రత్యేకత కావడంతో ప్రభుత్వ ఆగ్రహానికి గురై సంవత్సరాల తరబడి జైలుజీవితాన్ని చవిచూడాల్సి వచ్చింది.

1945లో జరిగిన ఎన్నికలలో ఢిల్లీ నుండి భారీ ఆధిక్యతతో విజయం సాధించిన ఆసఫ్ ఆలీ నెహ్రూ˙ నేతృ త్వంలో ఏర్పడిన మంత్రివర్గంలో చేరారు. ఆ తరు వాత రాజ్యాంగ రచన సంఘం సాగించిన చర్చలలో పాల్గొని, లౌకిక భావాల పరిరక్షణాంశాల పట్ల ప్రత్యేక శ్రద్దచూపారు. మంచి న్యాయవాదిగా పేర్గాంచిన ఆయన భగత్‌సింగ్ పక్షాన న్యాయ పోరాటం చేయడమేకాకుండా, Indian National Army పక్షాన వాదించేందుకు జాతీయ కాంగ్రెస్‌ ఏర్పాటు చేసన 'INA Defence Committee' కార్యదార్శిగా పనిచేశారు. ఆనాడు ఆసఫ్‌ అలీ నాయకత్వంలో విజయం సాధించిన ఆ కమిటీ పలువురు Indian National Army యోధులను కాపాడుకుంది.

1947 తరువాత స్వతంత్ర భారతదేశంలో ఆయన పలు ఉన్నత పదవులను నిర్వహించి ప్రపంచ దేశాలలో భారతదేశం పేరుప్రతిష్టలను ఇనుమడింప చేశారు. ప్రజ్ఞావంతుడైన న్యాయవాదిగా, ఉత్తమ ఉర్దూ సాహిత్యవేత్తగా, సునిశిత విమర్శకుడిగా, నిబద్ధత గల నేతగా, అసాధారణ వక్తగా, అద్బుతమైన రాయబారిగా, అన్ని రంగాలలో రాణించి, భారత సాంఘిక, రాజకీయ రంగాలలో తనదైన శాశ్వత ముద్రను ప్రతిష్టించుకున్న యం.ఆసఫ్‌ అలీ 1953 ఏప్రిల్‌ 2న కన్నుమూశారు.

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌