పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

149

66. మౌలానా హస్రత్‌ మోహాని

( 1878-1951)

స్వరాజ్యం కాదు కావాల్సింది సంపూర్ణ స్వరాజ్యం అంటూ ఎలుగెత్తిచాటి గాంధీజీ అభిప్రాయానికి వ్యతిరేకంగా సభికుల్నిఆకట్టుకుని జాతీయ కాంగ్రెస్‌ సమావేశాల్లో మహత్ముడ్ని సయితం కలవరపెట్టిం చిన 'చిచ్చర పిడుగు' మౌలానా హస్రత్‌ మోహాని.

1878లో ఉత్తర ప్రదేశ్‌ లోని మోహన్‌ అను పట్టణంలో జన్మించిన ఆయన అసలు పేరు సయ్యద్‌ ఫజులుల్‌ హసన్‌. మంచి కవిగా ఖ్యాతిగాంచిన ఆయన కలం పేరు 'హస్రత్' . జన్మస్థానం 'మోహన్‌' పేరును కలుపుకుని ఆయన 'హస్రత్‌ మోహాని' అయ్యారు. పదిహేడవ ఏటనే మోహాని గజల్స్‌ రాయటం ప్రారంభించి, 'ఉరూ-యే-ముల్లా' పత్రికకు ఎడిటర్‌గా వ్యవహరించారు. అరవిందాఘోష్‌, బాల గంగాధర తిలక్‌ల విప్లవాత్మక భావాల పట్ల ఆకర్షితులైన ఆయన చదువు పూర్తి కాగానే నౌకరుగా చాకిరి చేయటం ఇష్టంలేక జర్నలిస్టుగా జీవితం ప్రారంభించారు. బానిసత్వాన్ని ఏ రూపంలో ఉన్నా సహించని ఆయన బ్రిటిష్‌ ప్రభుత్వమ్ మీద తిరుగులేని పోరు సలిపేందుకు నడుంకట్టి 1903లో భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరారు.

విప్లవాత్మక భావాలతో బ్రిటిష్‌ ప్రభుత్వం పై విరుచుకుపడుతూ రాసిన వ్యాసాల కారణంగా 1909లో ఆయన మీద ప్రభుత్వం రాజద్రోహం నేరం మోపింది.

చిరస్మరణీయులు