పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

132

నుండి ఆరంభమైన ఆయన జైలు జీవితం పది సంవత్సరాలకు పైగా సాగింది. ఖిలాఫత్‌ ఉద్యమం సమయంలో మౌలానాను అరెస్టు చేశారు. ఆ సమయంలో కలకత్తా కేంద్రమ్గా ఆయన నిర్వహిస్తున్న కార్యక్రమాలను చేపట్టేందుకు ముందుకు వచ్చిన బేగం జులేఖా 'నా భర్త అరెస్టు వలన బెంగాల్‌ ఖిలాఫత్‌ కమిటీ కార్యక్రమాల నిర్వహణలో ఏర్పడిన ఖాళీని నా కృషితో భర్తీ చేస్తాను...ఈ నశ్వరమైన శరీరాన్నిఖిలాఫత్‌ ఉద్యమానికి సంపూర్ణంగా అంకితం చేయాలని నిర్ణయించుకున్నాను' అని గాంధీజీకి లేఖ రాశారు.

1923 ప్రాంతంలో ఒకసారి, 1939లో మరోసారి మౌలానా భారత జాతీయ కాంగ్రెస్‌ అధ్యాక్షులుగా ఎంపిక కావడం, ఆయన జాతీయోద్యమ అగ్రనేత కావడం, జాతీయ కాంగ్రెస్‌ కార్యక్రమాలన్నిటిలో ప్రధాన పాత్ర పోషించడం వలన మౌలానా కార్యకలాపాలు బాగా విసృతమయ్యాయి. ఆయనకు ఇంటి గురించి గాని, ఇల్లాలు గురించి గాని, ఆమె ఆరోగ్యం గురించి గాని, ఆర్థిక పరిస్థితుల గురించి గాని పట్టించుకునే అవకాశం ఏమాత్రం లేకుండా పోయింది. ఆ బాధాకరమైన వాతావరణాన్ని ఏకాంతంగా భరిస్తూ, కష్టాలను సహిస్తూ, తమలాగే అవస్థలు పడుతున్న సాటి జాతీయోద్యమకారుల కుటుంబాలకు నైతికబలాన్ని మాత్రమే కాకుండా ఆర్థికంగా తొడ్పాటు అందించారు.

1941లో జులేఖా బేగం అనారోగ్యం మరింత తీవ్రతరమయ్యింది. డాక్టర్ల సలహా మేరకు ఆమె కలకత్తా వదలి రాంచీ వెళ్ళి 1942 లై 31న తిరిగి కలకత్తాకు వచ్చీ రాకముందే 1942 ఆగస్టు లో మౌలానా అఖిల భారత కాంగ్రెస్‌ సమావేశాలకు బొంబాయికి వెళ్ళాల్సి వచ్చింది. ఆమె అనారోగ్యం వలన ఎంతో బాధ పడుతున్నప్పటికీ, త్వరగా వస్తానంటూ బయలుదేరుతున్న మౌలానాకు ఎంతో ధైర్యం చెప్పి పంపారు.

ఆ తరువాత అరెస్టులు, జైళ్ళ కారణంగా వాగ్దానం చేసినట్టుగా మౌలానా ఇంటికి రాలేకపోయారు. ఆమె అనారోగ్యం మరింత తీవ్రతరమైంది. ఆ సమయంలో జైలులో ఉన్న మøలానాకు జులేఖా బేగం పలు ఉత్తరాలు రాసినా ఎక్కడ తన అనారోగ్యం గురించి పేర్కొనలేదు . చివరకు వార్తాపత్రికల ద్వారా ఆ విషయం తెలుసుకున్న మౌలానాను పెరోల్‌ మీద విడుదల చేయడానికి ప్రభుత్వం కొన్ని ఆంక్షలు విధించింది. ఆ ఆంక్షలకు తలవంచి తనను చూడ రావద్దని జులేఖా భర్తకు సందేశం పంపడంతో ఆమె కనీసం పరామర్శించడానికి కూడా మౌలానా ఆమె వద్దకు రాలేకపోయారు.

1943 ఏప్రిల్‌లో ఆమె అనారోగ్యం తీవ్రతరమైంది. డాక్టర్ల ప్రయత్నాలు ఫలించలేదు . భర్త కడసారి చూపుకు కూడా నోచుకోకుండా ఏప్రిల్‌ 19న మౌలానాకు ఆత్మీయ నైతిక బలాన్ని, స్పూర్తిదాయక ప్రేరణను అందించిన జులేఖా బేగం చివరి శ్వాసవిడిచారు.

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌