పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

128

పంపుకునేది లేదని స్పష్టంగా ప్రకటించారు. భర్త ఆరోగ్యం పట్ల బేగం ఆలం ఆవేదన చెందుతునప్పటికి, భర్త అభిప్రాయాన్ని గౌరవిస్తూ ప్రభుత్వానికి ఎటువంటి అభ్యర్థనలు పంపలేదు. ఈ పట్టుదల మూలంగా డాక్టర్‌ ఆలంకు ఎటువంటిచికిత్స జరగకపోవడంతో సమయం గడిచే కొద్ది ఆయన ఆరోగ్యం ప్రమాదకర స్థితికి చేరుకుని చివరకు రక్తం కక్కుకుంటూ ఆలం మృత్యువుకు సమీపం కాసాగారు.

ఆ పరిస్థితులలో బేగం ఆలంకు నచ్చచెప్పే ప్రయత్నించినా,పరాయి పాలకుల చెంత మోకరిల్లడానికి ఆమె ఇష్టపడలేదు. ఆ సమయంలో బేగం ఆలం నిరుపమాన దేశభక్తి, ఉద్యమకారుడైన భర్త దృఢనిర్ణయం పట్ల గల గౌరవం, ఆమెలోని అసమాన ధైర్య సాహసాలు బహిర్గతమయ్యాయి. ఈ సందర్బంగా బేగం ఆలం చేసిన ప్రకటన సంచలనం సృషించింది. ఆ ప్రకటన ఇలా సాగింది. మాతృభూమి 'స్వేచ్ఛాస్వాతంత్య్రాల నిమిత్తం పోరాడుతున్న నా భర్త జీవితం తొలుత ఈ జాతి సొత్తు, ఆ తరువాత మాత్రమే నాది, మరెవరిదైనా. అందువలన నాభర్త జీవితాన్ని ఎలా ఉపయాగించుకోవాలన్నది జాతి జనులు నిర్ణయించాలి ...ప్రభుత్వాన్ని అర్థించి, నాభర్త నామీద ఉంచిన విశ్వాసాన్ని భంగపరుస్తూ, ఆయన త్యాగపూరిత దృఢ నిశ్ఛయానికి వ్యతిరేకంగా నేను వ్యవహరించ లేను...జరిగేదేదో జరగనివ్వండి. ఆ ఘోర విపత్తుకు బ్రిటిష్‌ ప్రభుత్వమే కారణం కానివ్వండి...నా భర్తను సింహంలా మృత్యువును స్వీకరించనివ్వండి...జాతి ప్రయాజనాలు, ఆత్మ గౌరవాభిమానాల పరిరక్షణ విషయంలో వ్యక్తిగత జీవితాలు అంత ప్రాముఖ్యం కావు...మాతృదేశ విముక్తి పోరాటంలో ధానమాన ప్రాణాలను బలిపెట్టాల్సి ఉంటుంది...అందుకు ఎవ్వరూ చింతించాల్సిన అవసరం లేదు సరికదా, మనమంతా మరింతగా గర్వపడాలి...బ్రిటిష్ వాళ్ళతో పోరాడినట్టే, మృత్యువుతో కూడ పోరాడి ఆయన విజయం సాధించగలరు. ఒకవేళ మృత్యువుదే పైచేయి అయినట్టయితే, గౌరవప్రదమైన జీవితం సాగించే ఉద్యమ కారునికి లభించే మరణం, పదికాలాల పాటు నికృష్టంగా గడిపే భయంకర బానిస జీవితం కంటే ఎంతో ఉన్నతమైంది'

ఈ ప్రకటన అటు ప్రభుత్వవర్గాలలోనూ ఇటు ప్రజలలోనూ సంచలనానికి కారణమైంది. బేగం ఆలం ధైర్యానికి, ఆమెలో దాగిఉన్నఉద్యమ నిబద్దతకు , భర్త నిర్ణయాల పట్ల గల గౌరవానికి జాతీయోద్యమకారులు, ప్రజలు జేజేలు పలికారు. ఆ విధంగా ఉద్యమకారులకు స్పూర్తిదాయక మార్గదర్శ కం చేసన బేగం ఆలం డాక్టకర్‌ ఆలంతోపాటుగా విముక్తి పోరాటంలో భాగస్వామ్యం వహించి చిరస్మరణీయులయ్యారు.

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌