పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

118

భారతదశంలోని హిందూ-ముస్ల్ంల మధ్యన సన్నిహిత సంబంధాలు మరింత పటిష్టం కావాలని, ఈ రండు ప్రదాన జీవన స్రవంతుల మధ్య ఐక్యత మరింతంగా పరిఢవిల్లాలని ఆయన కోరుకున్నారు. ఖిలాఫత్‌ ఉద్యమంలో హిందూ సోదరులు అన్ని విధాల సహకరించినందున ఈ ఐక్యతను కాపాడుకోవాల్సి ఉందని ప్రగాఢంగా వాంఛించారు.

1928 బార్డోలి సత్యాగ్రహ కార్యక్రమంలో పలు బాధ్య తలు చేపట్టారు. దండియాత్ర సందర్భంగా బ్రిటిష్‌ ప్రభుత్వం గాంధీజీని అరెస్టు చేసినప్పుడు ఆయన స్థానంలో అబ్బాస్‌ నాయకత్వం చేపట్టారు. ఆ సందర్భంగా ఆయన జైలుపాలయ్యారు. పండు వయస్సులో కూడా మొక్కవోని ధైర్యంతో, అనారోగ్యాన్నికూడా లెక్క చేయక విముక్తి పోరాటమే ఊపిరిగా సాగిన ఆయన జాతీయోద్యమకారులకు ఆదర్శప్రాయుడయ్యారు.

జాతీయోద్యమానికి తన్ను తాను అంకితం చేసుకున్న, అబ్బాస్‌ తయ్యాబ్జీ గాంధీజీకి అత్యంత విశ్వాసపాత్రులైన ఉద్యమకారులలో ఒకరుగా ఖ్యాతిగాంచారు. గాంధీజీతో ఆయనకు ఉద్యమ సంబంధాలే కాక, వ్యక్తిగత సంబంధాలు ఉండేవి. గాంధీజీ తాను ఆచరణలో పెట్టదలచుకున్న పోరాట రూపాల ఫలితాలను పరిశీలించేందుకు, గుజరాత్‌ను పలుమార్లు ప్రయోగశాలగా స్వీకరించారు. ఆ సందర్భాలలో అబ్బాస్‌ తయ్యబ్జీ ద్వారా ఆ ప్రయోగాలను గుజరాత్‌లో నిర్వహించారు. ఈ మేరకు సహాయ నిరాకరణ ఉద్యమం, శాసనోల్లంఘన ఉద్యమం, పన్నుల వ్యతిరేక ఉద్యమం, విదేశీవస్తు బహిష్కరణ, మద్యపాన నిషేధం ఉద్యమం తొలుత అబ్బాస్‌ మార్గదర్శకత్వంలో గుజరాత్‌ నుండే ప్రారంభం గావటం గమనార్హం.

ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన, సంపన్న కుటుంబీకుడైన అబ్బాస్‌ 80 ఏండ్ల వయస్సులో కూడా అతి సామాన్య జాతీయోద్యమ కార్యకర్తగా గాంధీజీ బాటలో నడుస్తూ, ఉద్యమ కార్యక్రమాలను నిర్వహించిన తీరును గమనించిన మహాత్ముడు ఆయన కార్యక్రమాలను వివరిస్తూ, '..that Abbas saheb should go about carrying a wooden plate hung from his neck and inscribed with slogans, is no ordinary event. What contrast between what he was then, a judge admonishing others, and what he is now, and ex-judge, who with a wooden plate hanging from his neck, had sallied forth with his comrades, determined to let himself be manhandled by the police...' అని వ్యాఖ్యానించారు.

'గుజరాతీ వజ్రం' గా గాంధీజీ చేత పిలువబడిన అబ్బాస్‌ తయ్యాబ్జీ జీవితాంతం స్వాతంత్య్రసమరంలో పాల్గొంటూ, బ్రిటిష్‌ బానిసత్వంనుండి మాతృభూమి విముక్తి కోసం అవిశ్రాంతంగా శ్రమిస్తూ 1936, మే 9న తనువు చాలించారు.

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌