పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

114

సంతరించుకోవాలని పిలుపునిచ్చారు.

1911లో అలహాబాద్‌లో జరిగిన జాతీయ కాంగ్రెస్‌ సమావేశంలో ముస్లింల కోసం ప్రత్యేక నియోజక వర్గాల ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలను ఆయన వ్యతిరేకించారు. 1916 నుంచి స్వరాజ్య సాధన దిశగా కార్యకలాపాలను ముమ్మరం చేసిన ఆయన తన న్యాయమూర్తి పదవికి రాజీనామా చేసి పూర్తికాలం ఉద్యమకారునిగా పనిచేశారు. బొంబాయిలో జరిగిన కాంగ్రెస్‌ జాతీయ సమావేశానికి అధ్యక్షునిగా వ్యవహరించారు.

ఆ క్రమంలో హోంరూల్‌ ఉద్యమంలో బీహార్‌ నుండి ప్రముఖ పాత్ర వహించారు. జాతీయ కాంగ్రెస్‌-ముస్లిం లీగ్ ల మధ్యన అంతరం పెరగటం స్వరాజ్య సాధనకు మంచిది కాదన్నారు. అ సంస్థల మధ్యన సంబంధాలను మెరుగుపర్చేందుకు కాంగ్రెస్‌-లీగ్ పదకం రూపకల్పనకు ఆసక్తి చూపారు. 1919 నాటిరౌలత్‌ చట్టాన్ని తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తూ భారీ ప్రజాప్రదర్శన నిర్వహించి బ్రిటిష్‌ ప్రభుత్వాన్నికలవరపరిచారు.

ఇస్లాం మతంపట్ల ఎంతో గౌరవ భావం గల ఆయన మత దురహంకారం, మత నియంతృత్వంను పూర్తిగా విమర్శించారు. పర్దాపద్ధతిని వ్యతిరేకిస్తూ నైతిక విలువల పాటించడం ఐచ్ఛికం కావాలి తప్ప, నిర్బంధాలతో కూడదన్నారు. ఏ మతమైనా ప్రగతికి ఆటంకం కారాదన్నారు. ప్రజల ఉమ్మడి సమస్యల పరిష్కారం విషయంలో మత భావాలకు చోటు ఇవ్వరాదాన్నారు. మతం వ్యక్తిగతమని ప్రకటిస్తూ హిందూ-ముస్లింల మధ్యన స్నేహ సంబంధాలను కోరుకున్నారు. హిందూ-ముస్లింజన సముదాయాల మధ్య ఐక్యత కొరవడితే స్వరాజ్యం అసాధ్యమన్నారు. మాతృదేశానికి సంబంధించిన ఉమ్మడి సమస్య వచ్చినప్పుడు ప్రాంతీయ, మత ప్రాముఖ్యతలను పూర్తిగా విస్మరించాలన్నారు.

ఈ మేరకు అటు జాతీయోద్యమంలో, ఇటు సంస్కరణోద్యమంలో అవిశ్రాంతంగా గడుపుతున్న హసన్‌ ఇమామ్‌ 1931 నాటి స్వదేశీ ఉద్యమంలో పలు బాధ్యతలను నిర్వహించారు. ఖాధీ వస్త్రధారణకు అధిక ప్రచారం ఇవ్వడం మాత్రమే కాకుండా, ఖాదీ ప్రజలకు అందుబాటులోకి రావడానికి తగిన ఏర్పాట్ల పట్ల కూడా అత్యంత శ్రద్ధ చూపారు. స్వదేశీ ఉద్యమాన్ని ప్రజానీకంలోకి తీసుకెళ్ళేందుకు ఏర్పడిన 'స్వదేశీలీగ్' ప్రధాన కార్యదార్శిగా పనిచేస్తూ ఉత్తేజపూరిత ప్రసంగాల ద్వారా సబికులను కార్యాచరణకు పురికొల్పి ప్రభుత్వ ఆగ్రహానికి గురయ్యారు.

ఈ విధంగా బహుముఖ ప్రతిభతో అన్ని రంగాలలో తనదైన ప్రత్యేక ముద్ర వేసిన సయ్యద్‌ హసన్‌ ఇమామ్‌ 1933 ఏప్రిల్‌ 19న చివరిశ్వాస విడిచారు.

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌