పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సులభశైలిలో చారిత్రక వాస్తవాలను ఉటంకిస్తూ సాగించిన రచనారీతి అందరిని చదివింప జేస్తుంది. లౌకిక విలువల కోసం పాటుపడిన నాటితరం జీవితాలను వివరించడం ద్వారా, నేటి తరానికి ఆ విలువల ఆవశ్యకతను రచయిత తెలియజేస్తున్నారు.

సామాన్య ప్రజానీకానికి మాత్రమే కాకుండా, చరిత్రలో ప్రవేశమున్నవారికి సహితం తెలియని స్వాతంత్య్రసమరయోదుల జీవితాలను, వారి జీవితాలలోని ప్రత్యేక ఘట్టాలను చిరస్మరణీయులు ద్వారా రచయిత పరిచయం చేస్తున్నారు. స్వాతంత్య్రోద్యమం లోని వివిధ దాశలలో ఆ యోధులు నిర్వహించిన అత్యంత ప్రాధాన్యత గల పాత్రను తగిన ఆధారాలతో సహా ఈ గ్రంథాన్ని రచయిత రూపొందించారు. ఈ పరిచయం క్లుప్తంగా రెండుపేజీలకు మించకున్నా వ్యక్తుల ప్రాముఖ్యతకు ఎక్కడ ఏమాత్రం లోటు రానివ్వకుండా రచయిత నశీర్‌ అహమ్మద్‌ తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.

1757లో ఆంగ్లేయుల కుటిలత్వాన్ని ఆదిలోనే గ్రహంచి వారి ఆటకట్టించేందుకు యత్నించిన బెంగాలు నవాబు సిరాజుద్దౌలా, మీర్‌ ఖాశింల నుండి ఆరంభమై బ్రిటిషర్ల సామ్రాజ్యవిస్తరణ కాంక్షను తొలిదశలోనే పసిగట్టి స్వదేశీయులను హెచ్చరించడమే కాకుండా చివరి క్షణం వరకు ఆంగ్లేయులను అడుగడుగునా అడ్దుకున్న హైదర్‌ అలీ, టిపూ సుల్తాన్‌ల వీరోచిత పోరాటాల విశేషాలతో చిరస్మరణీయులు ప్రారంభమౌతుంది. ఆనాడు బ్రిటిషర్లకు, వారికి తొత్తులుగా వ్యవహరిస్తూ ప్రజలను పీడిస్తున్న మహాజనులు, జమీందార్లకు వ్యతిరేకంగా ప్రజలను సమాయత్తం చేసి పోరుబాటన నడిపించి, అంగ్లేయాధికారులను ఖంగు తిన్పించిన ప్రజా పోరాట నాయకులైన సయ్యద్‌ అహ్మద్‌బరేల్వీ,టిటూమీర్‌, హాజీ షరియతుల్లా, దూదూమియా లాంటి యోధుల సమాచారాన్ని ఈ గ్రంథం అందిస్తుంది.

1857 నాటి పోరాటానికి నాయకత్వం వహించిన మొగల్‌ పాదుషా బహుద్దూర్‌షా జఫర్‌ నుండి ఆమనాటి పోరాటాలకు వ్యూహకర్తగా వ్యవహరించిన అజీముల్లా ఖాన్‌, ప్రథమ స్వాతంత్య్ర సమరయోధుల సర్వసేనాని భక్త్‌ఖాన్‌, ఆంగ్లేయ సైన్యాలను ముప్పు తిప్పులు పెట్టిన మౌల్వీఅహమ్మదుల్లా ఫైజాబాది నుండి సామాన్య సైనికులు పఠాన్‌ సలాబత్‌ ఖాన్‌ తదితరు లు మాతృభూమి విముక్తి కోరుతూ సాగిన పోరాటంలో నిర్వహించిన త్యాగమయ సాహసోపేత పాత్రను చిరస్మరణీయులు వెల్లడిస్తుంది.