పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

119


గీ.

నిలిచి సాగిలి మ్రొక్కి యో నీరజాక్ష!
నీకు నచ్చిన తొలిబంట నేన యిపుడు
నన్ను రమ్మన్నపనియేమి నాకుఁ దెలియ
నానతీయఁగఁ దగు నన్న నభవు డనియె.

54


క.

ఈ మునులు నిలిచియుండఁగ
నీ మహీధరముననుఁ బార్వతీశ్వరునిదెసన్
భూమి సమతలము సేయుము
గ్రామము నీపేరనొకటి గావింపు [1]మిటన్.

55


క.

అన నట్ల జేసి యచ్చట
హనుమంతుఁడు తనదుపేర హనుమగ్రామం
బను నొకగ్రామం బొనరిచి
తన నెలవున కఱిగె నంతఁ దద్విజవరులున్.

56


క.

అనుమోదమునను నరహరి
యనుమతిఁ దమయిండ్లనుండి హరిగృహమునకున్
జనుదెంచుచుఁ దత్పూజన
మొనరింపుచు నివ్విధమున నుండుచు నంతన్.

57


సీ.

అంబుజాక్షునకుఁ గల్యాణమహోత్సవం
బాచరింపఁగ మదియందుఁ దలచి
పువ్వుల చప్పరమ్ములు మేలు కురువేఱు
తావుల పందిళ్లు దళ్లు పెక్కు
పట్టులు మేల్కట్టు బహుదివ్యమణిపంక్తి
తోడ నమర్చిన తోరణములు
నగరు ధూపంబులు నంగడి వీథులు
బుగబుగలీను కప్పురపు మ్రుగ్గు
యాగశాలలు కనకకల్యాణవేది
భర్మహర్మ్యంబు[2]లును వీడుపట్లొనర్చి
చాటఁబనిచిరి సకలదిక్చక్రమునను
సరసిజాక్షుని పరిణయోత్సవదినంబు.

58
  1. మికన్. తా. పూ. ము.
  2. లను. పూ.ము. తా.