పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/198

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

118

ఘటికాచలమాహాత్మ్యము


సర్వభూతాత్మకుండపు సర్వ శుచివి
నీప్రభావంబు దెలియంగ నేర్తు మెట్లు?

48


సీ.

నీవాఁడుగావున నిధినాథుఁడయ్యెను
దేవ! కుబేరుండు దివిజవరుఁడు
నినుఁ గొల్చి దుర్వాసముని శాపజలధిలో
మునిగిన శ్రీ గాంచే మున్నువోలె
కడఁకతో తండ్రి యంకంబెఱుంగనివాని
[1]గాఁచితి నీ యంకగానిఁ గాఁగ
జనకుని కృతవీర్యసంభవు నంబరీ
షునిఁ గాచితివి మున్ను జనులు వొగడ
ఘనకృపావిభవమ్మునఁ గావు మమ్ము
నని మునీంద్రులు గొనియాడఁగా నృసింహుఁ
డంబుదారావగఁభీర మయిన ఫణితి
హితము దళుకొత్త వారల కిట్టులనియె.

49


క.

మెచ్చితిమునులారా మీ
యిచ్చికు వచ్చిన వరమ్ము లెయ్యవి చెపుడా
యిచ్చెద నన వారును మది
నిచ్చలముగ భక్తి యుక్తి నియతి దలిర్పన్.

50


క.

దేవా యిగ్గిరిచుట్టును
నేవేళన్ నీదుసేవ యే మొనరింపన్
దా వొసఁగు మనుచు వేడిన
నా విభుఁడపు డాంజ నేయు నాత్మఁదలంపన్.

51


వ.

అంత.

52


మ.

కనకోర్వీధరసన్నిభంబగు మహాకాయంబుతో విస్ఫుర
ద్ఘనకాంతిస్ఫుటకుండలద్వయముతోఁ గౌశేయవస్త్రంబుతోఁ
గనదుత్కంపితవాలవేష్టనముతోఁ గమ్రాంజలిస్ఫూర్తితో
హనుమంతుం డపు డేగు దెంచి నిలిచెన్ హర్యగ్రభాగంబునన్.

53
  1. గాంచితి నీయంతవానిగాగ. పూ. ము.