పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

107


ప్రాజ్య ముక్తాఫలోదంచద్వితానంబు
సురభిళాగురుధూపశోభితంబు
వివిధ నటీ[1]నాట్య విభ్రమాకాంతంబు
కిన్నర గంధర్వ గీతి యుతము
...........................
............................
రత్నరాజిప్రదీప విరాజమాన
మైనయొక్క విమానంబు గానఁబడియె.

6


క.

వారంతఁ ద ద్విమాన
ద్వారము సొత్తెంచి నిలువ దక్షిణదిశగా
[2]చేరి వెసం బ్రసవాయుధ
వైరి నిరీక్షించి ప్రమథవైభవమెసఁగన్.

7


సీ.

కరముల శంఖచక్రములు దాల్చినవాని
మురువైన తెఱనోటి యొఱపువాని
లోవంక మూపుల ఠీవిఁబొల్చినవాని
పద్మాసనంబునఁ బరఁగువాని
యోగపట్టికనొప్పు నూరుద్వయంబుపై
దొరయనిల్పిన కేలుదోయివాని
మేరుకూటంబుపై మిహిరబింబము లీల
శిరముపై మకుటంబు చెలఁగువాని
బాలచంద్రుని పైనున్న బాలచంద్రు
బోలు నళికోర్ధ్వపుండ్రంబు పొలుపువాని
కనకన వెలుంగు నంగారక విధమునను
గాననయ్యెడి మిక్కిలికంటివాని.

8


వ.

మఱియుఁ గలుషలక్ష్యభేదంబు సేయ వినతంబులగు త్రిణతంబులకొమ
రున బొమదోయిదీపింపఁ గురులసిరులవరలు మోముదమ్మినిమ్ముల
నిందిందిరమ్ములు గ్రమ్ముకొన మంకెనకావి సుంకంబుగొనుతావి

  1. నట. పూ. ము.
  2. జిరదిశన్.