పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

79


పూర్వాంబుధిప్రాంతభూమిఁ గన్పట్టెడు
మంజు ప్రవాళ నికుంజమనఁగ
కుముద రమ పెంపు నెత్తమ్మిగుంపు సొంపు
కటిక చీకఁటి [1]తిండి శంకరునిబండి
వేవెలుంగులజోదు మువ్వేల్పుపాదు
ప్రాచిఁగనుపట్టె మినుకులబరణి తరణి.

158


సీ.

అట జటాధరనిటలాంబకు లంబర
తటినిలో నిత్యకృత్యములుదీర్చి
సైకతవేదికాస్థలముననుండి యొం
డొరులనీక్షించి యత్యుగ్రనిష్ఠఁ
బేర్చి తపంబుఁగావింపఁ బెక్కుసహస్ర
[2]సమలు గతించె విఘ్నములు దోచె
నడపొడ గాన మయ్యఖిలలోకేశ్వరు
డా రమాజాని ప్రత్యక్షమగునె
భాగ్యహీనుల కకట తాపసులలోన
వాసి వన్నెయుఁ బోఁ దలవంపుగాగఁ
బూన్కి చాలించి పోరాదు పోయి యేరిఁ
గాంచినను గార మిఁక యేది గతి తలంప.

159


క.

అని తలపోయుతఱిన్ భో
రన నంబరవాణి పలికె నతినిష్ఠ తపం
బొనరింపఁ జనియె బహు హా
యనములు మునులార యీ యహార్యమునందున్.

160


క.

ఇచ్చట నెన్నాళ్ళకు నా
పచ్చికడాల్మేనిసామి ప్రత్యక్షంబౌ
టచ్చెరువు వినుఁడు వేఱొక
ముచ్చట యెఱిగింతు మీకు మోదంబొదవన్.

161
  1. దిండి. పూ. ము. తా.
  2. సమములు చె. తా. సమములు చెల్ల . పూ. ము.