ద్వీపకల్పంపై ఆధిపత్యం వహించి రెండు వందల సంవత్సరాల వరకు వెలిగిపోయిన విజయనగర సంస్కృతి, వైభవం అంత్యదశకు చేరుకుంది. విజేతలు యుద్ధ భూమిలో పది రోజుల వరకు మకాం వేసి తాము పొందిన గెలుపు ఫలితాలను ఆస్వాదించి తమ తమ రాజధానులకు వెళ్ళిపోయారు. ఉత్తరాన వున్న జిల్లాలు - రాయచూర్, ముద్గల్, అర్లంకార్ (Aurlankar), టక్రి (Takri), ఉత్తర, దక్షిణ ప్రాంతాలవారి వివాదానికి మూలకారణమైన జిల్లాలను వెంటనే స్వాధీనంలోకి తీసుకుని మిగతా ప్రాంతాలను స్థానిక చిన్న చిన్న పాలకుల దయాదాక్షిణ్యాలకు వదిలివేశారు. విశాలమైన విజయనగర సామ్రాజ్యాన్ని గోల్కొండ, బీజాపూర్ రాజ్య పరిధుల్లోకి కలుపుకోవడానికి కొన్ని సంవత్సరాల కాలం పట్టింది. మరో మార్గం లేక దక్షిణాన వున్న జిల్లాలను తిరుమల, వెంకటాద్రుల ఆధీనంలో రాచమర్యాదగా వుంచి గోల్కొండ, బీజాపూర్ రాజులు వారి వారి రాజ్యాలకు తిరిగి వెళ్ళిపోయారు.
విజయనగర సామ్రాజ్యం పతనం ఊహించని ఫలితం. కార్య సాధకమైన, విప్లవాత్మక ఘటన. ఈ విజయం దక్కన్ రాజ్యాలకు అనేక ప్రయోజనాలను చేకూర్చింది. రాజకీయంగా రక్షణ కలగడమే కాకుండా ఊహకందని అపార సంపద చేతికందింది. భవిష్యత్తులో ఎలాంటి దాడులు జరగవన్న ధీమా కలిగి ఒక ప్రశాంతమైన నిట్టూర్పు వదిలారు. లభ్యమైన ఆర్థిక వనరులతో తమ దేశాన్ని మరింతగా పటిష్టం, శక్తివంతం చేయవచ్చన్న భావనతో కూడిన ప్రశాంతత ఎంతో ఊరట నిచ్చింది. విజయనగరం సామ్రాజ్యానికి సరిహద్దు దేశాలుగా గోల్కొండ, బీజాపూర్ వుంటూ వారి రాజ్యంలోని క్షేత్ర పరిధులను కందికోట, గింజీ (Gingee) లవద్దకు విస్తరింపచేసుకోవడమే కాకుండా కాలక్రమేణా పలు సారవంతమైన భూభాగాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆ విధంగా విజయనగరం పతనం, దక్కన్ రాజ్యాలు దీర్ఘకాలం వరకు సుభిక్షంగా, సుసంపన్నంగా వుండటానికి ప్రధాన కారణమయ్యింది.