దక్కన్ భూభాగంలోని రాజుల మధ్య జరిగిన చివరి యుద్ధ సంఘటనలు వీటితో ముగింపు పలుకుతాయి. దక్కన్ రాజుల మధ్య చెలరేగిన పరస్పర ఈర్ష్య అసూయలు, వారు తలుచుకున్న ప్రణాళికలను వమ్ము చేశాయని చెప్పవచ్చు. చివరికి బీదర్ రాజును నిర్వీర్యం చేయలేక పోయారు. అటు విజయనగరం రాజులను ఓడించి వారిపైన ఆధిపత్యాన్ని చేపట్ట లేకపోయారు.
జమ్ షీద్ తన ఏడేళ్ళ పరిపాలనా కాలంలో 4-5 సంవత్సరాలు దాడులు, యుద్ధాలతోనే గడిచాయి. చివరి రెండు మూడు సంవత్సరాలు మాత్రమే ప్రశాంతంగా వుండగలిగాడు. ఈ కొద్దికాలంలోనే జమ్ షీద్ క్యాన్సర్ వ్యాధికి గురై 957 A.H. (1550 A.D.)లో మరణిస్తాడు. అతని పార్థివ దేహాన్ని సుల్తాన్ కులీ కుతుబ్షా సమాధి పక్కనే ఖననం చేస్తారు. జమ్ షీద్ సమాధి ఈ రోజుకు కూడా అద్భుతమైన నగిషీ చెక్కడాలతో అలరారుతోంది.
జమ్ షీద్ వ్యక్తిత్వాన్ని అతను సాధించిన విజయాలను సరిగా అంచనా వేయడం కాస్త కష్టతరమవుతుంది. అతను సింహాసనాన్ని అధిష్టించాలనే తీవ్రమైన కాంక్షతో చేసిన హేయమైన చర్యలు అతనిలోని సద్గుణాలను, అతను చేపట్టిన మంచి కార్యాలను కప్పిపెట్టాయి. అతని రాజనీతి, యుద్ధనీతి అమోఘం. మంచి యోధుడు. శత్రువులకు ఎదురు నిల్చి పోరాడి, విజయాలను సాధించి ధీరత్వం ప్రదర్శించినవాడు. ఒక్క నారాయణ్ ఖేడ్ మినహాయించి దక్కన్లోని రాజులందరికి అండగా నిలిచి సహాయపడినవాడు. ఎదురు తిరిగిన వారిని ఓడించి మట్టి కరిపించినవాడు. బుర్హాన్ ప్రదానం చేసిన బిరుదులను తృణప్రాయంగా తిరస్కరించి, స్వశక్తితో గెలిచినపుడే ఎలాంటి బిరుదులనైనా స్వీకరిస్తానని చెప్పిన సంస్కారం అతనిలో వుంది. అంతేకాదు, జమ్ షీద్ సాహిత్యాభిలాషి, మంచి కవి.