చేర్చి తెలుగు మాట్లాడే ప్రజలసంయుక్త రాష్ట్రంగా ఉద్భవించాల్సిన పరిస్థితుల అవసరం కానరాసాగినయి. కులీ కుతుబ్షా పాలనలో వున్న గోల్కొండ ఇంకా శైశవ దశలోనే వుంది. దానిని విస్తరింపజేయాల్సిన అవసరం అప్పటి రాజకీయ పరిస్థితులు, సంయుక్త రాష్ట్రం ఏర్పాటుకు దారులు వేయసాగాయి.
ఇరవై నాలుగు సంవత్సరాలకు పైగా గవర్నర్గా పాలన సాగిస్తున్న కులీ మంచి రాజనీతిజ్ఞుడు, వక్త. పాలనా వ్యవస్థ మీద అవగాహన వున్న వ్యక్తిగా, గవర్నర్గానూ, స్వతంత్ర రాజుగాను వ్యవహరించినవాడు. ఒకవైపు విజయనగర రాజులు, మరోవైపు బీదర్ ఈ రెండు తన గోల్కొండ విస్తీర్ణతకు అడ్డంకిగా వుండేవి. తనకాశ్రయమిచ్చిన 'మహమూద్ షా'కు సహాయకారిగా, యూసుఫ్ ఆదిల్ ఖాన్, దస్తర్ దినార్ పైన సైనిక చర్యకు గవర్నర్ గా ఎదుర్కొన్నాడు. 924 A.H. (1518 A.D.)లో మహమూద్ షా మరణానంతరం అతను గోల్కొండను పటిష్టం చేయాల్సిన మొదటి కార్యక్రమంగా పెట్టుకున్నాడు. ఫలితంగా తెలంగాణలోని చిన్న చిన్న రాజ్యాలపై దండెత్తి వారి కోటలను ఆక్రమించుకోవడం మొదలుపెట్టాడు. సైనికబలం, ఆయుధాలను సమకూర్చుకోసాగాడు. మొదటగా అతనికి రాచకొండ (Raj konda) దుర్గం ఆకర్షించింది. ఈ యుద్ధంలో సైనికులు అధిక సంఖ్యలో మరణించారు. రాచకొండ రాజు వెంకటనాయకన్ను బంధించారు. తరువాత దేవరకొండ దుర్గాన్ని లక్ష్యంగా చేసుకున్నాడు. కాని దేవరకొండ దుర్గం ఆక్రమించుకున్న తరువాత అనేక రాజకీయ సమస్యలకు తెరతీసింది. ప్రధానంగా గోల్కొండ సర్కారుకు విజయనగరం రాజులతో ముఖాముఖి నిలబడవలసిన పరిస్థితులు నెలకొన్నాయి. దక్షిణాన వున్న రాజు తన సైనిక బలగాన్ని ఆగ్నేయ దిశగా సరిహద్దుల వెంబడి మోహరించి కులీ రాజ్యం అభివృద్ధిని, కదలికలను ఒక కంట కనిపెట్టసాగాడు. అంతేకాదు యుద్ధానికి కవ్వించసాగాడు. అంతగా యుద్ధానికి సిద్ధం లేకున్నా సుల్తాన్ కులీ తన యుద్ధ నైపుణ్యం, చతురతతో శత్రువులను తరిమికొట్టగలిగినాడు. ఆ విజయంతో మరింత చైతన్యం పొందిన కులీ కృష్ణానదీ లోయలోని పానగల్లు కోటను ఆక్రమించుకున్నాడు. పానగల్లు ప్రదేశం ఒక వ్యూహాత్మక కేంద్రంగా మారి విజయనగరం రాజుల దూకుడును నియంత్రించగలిగింది. ఆ తదుపరి పానగల్లు నుండి ఘనపురం, కోయల్కొండ కోటలపై దాడి చేసి వాటిని స్వాధీనపరుచుకున్నాడు. కోయల్కొండ రాజు ఆధీనంలో కృష్ణా, తుంగభద్ర లోయ పరీవాహక ప్రాంతాలుండేవి. కోయల్ కొండపై విజయం తరువాత గోల్కొండకు తిరిగి చేరుకున్న కులీకి, కొద్ది కాలానికే ఖమ్మం మెట్టు రాజు కుతుబ్ షాహి రాజ్య సరిహద్దులను దాటి అక్కడి ప్రాంతాలను అక్రమంగా స్వాధీనపరుచుకుంటున్నట్లు అందిన వార్తలతో కలతచెంది ఎదురు దాడికి దిగుతాడు. ఉత్తర తెలంగాణ ప్రాంతాలవారీ రాజులు ఏకమై కూటమిగా ఏర్పడి మూకుమ్మడిగా కులీని ఎదుర్కోవడంచే కులీకి యుద్ధం గెలవడం కష్టతరమవుతుంది. రాంచందర్, హరిచంద్ లాంటి రాజులు ఖమ్మం మెట్టు రాజుతో