ఖాన్, ఇమాదుల్ ఖాన్ ల నాయకత్వంలో నడిచే ప్రాంతీయ రక్షణ దళాలు (provincial contingent) కూడా తోడయ్యాయి. బహదుర్ గిలాని ఆధీనంలో వుండే జమ్ ఖండి (Jamkhandi) కోటను మొదట లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకు తెలంగాణ ప్రాంతానికి గవర్నర్ అయిన కుత్బుల్ ముల్క్ దక్కని (Qutbul Mulk Deccani) ని కోట ప్రాంతాన్ని ఆక్రమించుకోవడానికి నియమితుడయ్యాడు. కాని దురదృష్టవశాత్తు కుత్బుల్ ముల్క్ కొద్ది కాలానికే మరణించడం జరిగింది. ఫలితంగా రాజు, సుల్తాన్ కులీని అతని స్థానంలో నియమించి 'కుత్బుల్ ముల్క్ బిరుదును కూడా ప్రసాదించాడు. కులీకి ఈ బిరుదుతో పాటు ఇంతకుముందు ప్రధానం చేసిన 'ఖ్వాస్ ఖాన్' (Khawas khan) బిరుదు అదృష్టాన్ని తెచ్చిపెట్టాయి. ఈ బిరుదులు అదృష్టంగా పరిణమించడంతో కులీ వీటిని వంశనామంగానే కొనసాగించాడు. అలా రెండు వందల సంవత్సరాల వరకు ఇతని వంశం వారు ఈ పేరుతోనే చరిత్రలో ప్రసిద్ధికెక్కారు. తెలుగు రాష్ట్ర ప్రాంతాలకు స్వతంత్రత ప్రకటించుకున్న సమయంలో కులీ 'కుతుబ్ షా'గా పిలువబడినాడు. జమ్ ఖండి (Jamkhandi) ని అక్రమించుకున్న తరువాత 'మంగ్లేర్, మిరాజ్'లను స్వాధీన పరుచుకున్నారు. 'కల్లహర్' ప్రాంతాన్ని రాజు స్వయంగా దాడి చేసి స్వాధీనపరచుకున్నాడు. 'పనాల' ప్రాంతం చాలా కాలం బహమనీ వారి ఆధీనంలోనే వుండేది. కాని చివరికి 'ఖాజా జహా ఫక్రుల్ ముల్క్, 'సుల్తాన్ కులీ కుత్బుల్ ముల్క్క అప్పగించేశాడు. ఈ పరిణామాలవలన బహదూర్ గిలాని నిరాశకు లోనయ్యాడు. ఇద్దరు సైనికాధిపతులు (Generals) రాజు మన్ననలు పొందినవారై అనేక గౌరవాలు, సన్మానాలు పొందగలిగారు. 'ఖాజా జహా, మఖూమ్' అనే బిరుదుతో సత్కరింపబడినాడు. పశ్చిమ ప్రాంతాలపై సైనిక చర్యల తర్వాత రాజు తిరిగి తన రాజధానికి చేరుకున్నాడు. బహదుర్ గిలాని ఓడిపోయిన సంతోష వార్తతో పాటు అనేక విలువైన బహుమతులను గుజరాత్ రాజైన 'మహమూద్ షా'కు పంపించాడు. 'కుత్బుల్ ముల్క్ దక్కని' మరణం తర్వాత తెలంగాణ ప్రాంతానికి గవర్నర్ పదవి ఖాళీగా వుండటంతో, సుల్తాన్ కులీని తెలంగాణకు గవర్నర్ గా నియమించి గోల్కొండ, వరంగల్ ప్రాంతాలను కూడా కులీ పాలనా క్షేత్ర పరిధిలోకి విలీనం చేశాడు.
15వ శతాబ్ది చివరి రెండు దశాబ్దాల కాలంలో జరిగిన రాజకీయ పరిస్థితులను ఒకసారి సింహావలోకనం చేసుకుంటే గాని చరిత్రలో జరగబోయే సంఘటనలకు కారణాలు, పరిస్థితులు పరిణామక్రమాల స్వభావాలు అర్థం కావు.