Jump to content

పుట:గోల్కొండ చరిత్ర.pdf/328

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాజ్యాభిషేకానికి ముందే ఈ నగర నిర్మాణం 1035 A.H. లో జరిగింది. హైదరాబాద్ నగరానికి తూర్పు దిశలో నిర్మించబడిన పట్టణం ప్రత్యేకంగా ఉత్సవ కార్యక్రమాలకు, రాజరిక క్రీడలకు ప్రధాన కేంద్రంగా వుండేది. అంతేగాక మచిలీపట్నం వెళ్ళే ప్రధాన రహదారి మీద వుండటంచే హైదరాబాద్ నగరానికి వచ్చే యాత్రికులు, ప్రయాణికులు ఇక్కడ తాత్కాలికంగా బస చేసేవారు. ఆ విధంగా ఈ పట్టణం అతిథి గృహంలా వినియోగించబడేది. హైదరాబాద్ నగరం లోపల మా సాహెబ్ సత్రం (Ma Sahab inn) పేరుతో ఒక విశాలమైన భవంతి యాత్రికుల సౌకర్యార్థం నిర్మించబడింది. ఇందులో ప్రార్థనల కోసం మసీదు నిర్మాణం కూడా జరిగింది. దీనికి దగ్గరలో 'ఖాస్ బాగ్' (Khas Bagh) అనే గార్డెన్, ఒక పాఠశాల నిర్మించారు. నిజాముద్దీన్ (Nizamuddin) చరిత్రకారుడు హయత్ బక్షీ బేగమ్ కాలంలో నిర్మించబడిన హయతాబాద్ గురించి వివరిస్తూ ఇలా అంటాడు:

"గోల్కొండ రాజ్యానికి ఆరు మైళ్ళ దూరంలో తూర్పున వున్న హయతాబాద్ స్వర్గ శోభలతో, స్వర్గంలో ఒక భాగంగా కాంతివంతంగా అలరారే నగరం.కుతుబ్ షాహిల వైభవోపేతమైన పాలనలో నగరం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ద బడింది. విశాలమైన భవంతులు, అందమైన ఉద్యానవనాలు, వృత్తి కళాకారులకు, పారిశ్రామికులకు నిలయమై, హైదరాబాద్ లో వున్న సకల సౌకర్యాలతో సమానంగా విలసిల్లే నగరం హయతాబాద్”. - విదేశీ యాత్రికులు, చరిత్రకారులు అనేకులు-టావెర్నియర్, విలియం మెథోల్డ్, ఫెరిస్తా, ఖఫీఖాన్, మహమ్మద్ సకీ - ఇలా అందరూ హైదరాబాద్ సందర్శించి వేనోళ్ళ పొగిడారు. గోల్కొండ రాజ్యంలోని హైదరాబాద్, సుందరమైన విశాలమైన, నగిషీలతో శోభిల్లుతూ వుండే రాజభవనాలు, విశాలమైన రహదారులు, అందమైన ఉద్యానవనాలు, పుష్కలంగా తాగునీటి సరఫరా, సాగునీటి సదుపాయం, ఆరోగ్యకర వాతావరణం, ఆహ్లాదాన్ని కలిగించే పరిసరాలు వీటన్నింటితో శోభాయమానంగా, స్వర్గసీమలా వర్థిల్లేదని వర్ణించారు. హైదరాబాద్ గొప్పదనం వాస్తవానికి ప్రపంచానికి చూపే చారిత్రాత్మక ప్రకటన. మధ్యయుగ కాలపు (Medieval age) అద్భుతం. కుతుబ్ షాహి రాజుల అభిరుచికి, ప్రేమకు ప్రతిరూపం. మొఘల్ చక్రవర్తులను ఆశ్చర్యానికి గురి చేసిన అద్భుతమైన నగరం. భారత భూభాగంలో నున్న రాజ్యాలన్నింటిలో పురోగతిలో తనకు సరితూగేది ఏదీ లేదని గర్వంగా చెప్పుకోగలనగరం. ప్రసిద్ధ కవుల కవిత్వంలో అలరారిన మణిమకుటం. కుతుబ్ షాహిల విలువైన వారసత్వాన్ని పొందిన ఆంధ్ర ప్రజలకు ఇది గర్వకారణం. ఆంధ్ర దేశంలో ప్రసిద్ధి పొందిన నగరం ఇదొక్కటే. వర్తమానంలో కూడా సామాజికపరంగా, రాజకీయపరంగా, మేధోపరంగా జీవితాలను వుత్తేజపరుస్తూ నాడీ కేంద్రమయింది అలనాటి గోలకొండ రాజ్యం.