Jump to content

పుట:గోల్కొండ చరిత్ర.pdf/327

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కుతుబ్ షాహిలే తీర్చిదిద్దారు. ఆ ప్రాకృతిక సుందర దృశ్యాలను చూసి మొఘల్ చక్రవర్తులు, రాజకుమారులు కూడా ఆశ్చర్యంతో నిశ్చేష్టులై పోయేవారు. ఔరంగజేబు చిన్న కుమారుడు 'మహమ్మద్ కంబక్ష్ హైదరాబాద్ గవర్నర్ గా నియమించబడి నప్పుడు కుతుబ్ షాహి భవనాలకు భిన్నంగా తన నివాసాన్ని నిర్మించాలనుకున్నాడు. దీనిని మొఘల్ చక్రవర్తి విచ్చలవిడి ఖర్చుగా భావించి వ్యతిరేకించాడు. అందుకు (రాకుమారుడు) ప్రిన్స్ జవాబుగా - "కుతుబ్ షాహిల నివాసాలకు దీటుగా కట్టాలి అంటే ఇంకా ఖర్చు అధికమవుతుంది. ఆ విశాలమైన భవనాలు, ఆశ్చర్యానికి లోను చేసే నిర్మాణ సౌందర్యాలు చెప్పనలవికానివి. అలాంటి భవనాల నిర్వహణయే కాదు, చివరికి దీపాలంకరణ చేయడం కూడా సంభవం కాదు” అని నిర్మొహమాటంగా చెప్పాడు. చక్రవర్తి షాజహాన్ కట్టించిన ఆడంబరమైన, సుఖవంతమైన, సౌకర్యవంతమైన రాజ భవనాలలో నివసించే మొఘల్ ప్రిన్స్ నోటి నుండి ఈ మాటలు రావడమంటే కుతుబ్ షాహి రాజభవనాల వైభవం వర్ణించడానికి మరో ఉదాహరణ లేదన్నది వాస్తవం.

ప్రజాహిత కార్యక్రమాలు (Public Works) ప్రభుత్వ కార్యకలాపాలు:

కుతుబ్ షాహిలు చేపట్టిన వాటిలో ప్రజాహిత కార్యక్రమాలు కూడా ప్రత్యేకంగా చెప్పుకోదగ్గవి. ఇందుకు మొదటగా చొరవ తీసుకుని మసీదులు, పాఠశాలలు, చెరువులు కట్టించినవాడు ఇబ్రహీం కులీ కుతుబ్ షా. హుసేన్ సాగర్ చెరువు, ఇబ్రహీం పటాన్ చెరువు (Ibraheem Patan tank), బద్వేల్ చెరువు (Budwel tank) ప్రధానంగా వ్యవసాయానికి, సాగునీటికి, తాగునీటికి వుద్దేశించబడినవి. హుసేన్ సాగర్ సరస్సు, హజరత్ హుసేన్ షా వలి (Hazrat Husain Shah Wali) పర్యవేక్షణలో నిర్మించబడింది. దీని నిర్మాణానికి ఎనిమిది నెలల కాలం, రెండు లక్షలు ఖర్చయ్యాయి. ఇతని అడుగు జాడల్లోన నడిచి, తరువాత వచ్చిన రాజులు అనేక పాఠశాలలు, సత్రాలు, స్నాన గదులు, ఈత కొలనులు, అనాథ శరణాలయాలు కట్టించారు. హయత్ బక్షి బేగమ్ చేపట్టిన సాంస్కృతిక, సాంప్రదాయ కార్యక్రమాలు, ప్రజాసంక్షేమ కార్యకలాపాలు విస్మరించలేం. ఆమె ఎనభై ఏళ్ళ జీవిత కాలంలో చేసిన ప్రజాసేవ, సంక్షేమ కార్యాలకు అందించిన సహకారం మాటల్లో వర్ణించలేనిది. మొహర్రం నెలఐదవ రోజు ఆమె చేపట్టే 'లంగర్ సేవలు' (Lunger procession) చిరస్మరణీయం. ఇంకా 'హుస్సేని ఆలం, బీబీ కా ఆలం, బీబీ కా చష్మా' చెరిగిపోని జ్ఞాపకాలు. కాని 'హయతాబాద్' ఇంతకు ముందు చెప్పిన జ్ఞాపికలను దాటి పోతుంది. నిర్మాణరంగంలో ఆమెకు ఉన్న అభిరుచి, చమత్కార ధోరణి, ఆమె వ్యక్తిత్వానికి అద్దం పడతాయి. సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్ షా