భవంతులు, రాజప్రాసాదాలు, తోరణాలు, ఉద్యాన వనాలతో సుందరంగా తీర్చిదిద్దబడింది. మూసీ నది పరివాహక ప్రాంతంలో వుండి తాగునీటి కొరత లేకుండా నదీలోయ అందాలు కూడా తోడయ్యాయి. నగరం మధ్యలో చార్మినార్ ఓ అద్భుతమైన కట్టడం.
ప్రజా భవనాలు (Public Buildings)
చార్మినార్, మక్కా మసీదు ప్రపంచంలోనే గుర్తించబడిన గొప్ప అద్భుతమైన కట్టడాలు. చార్మినార్ చతురస్రాకారంలో నిర్మితమై నాలుగు వైపులా నాలుగు మినార్లతో, ఒక్కొక్క మినార్ 186 అడుగులెత్తుతో రాచఠీవీతో దర్శనమిస్తుంది. చార్మినార్ కు నాలుగు విశాలమైన రహదారులు, చక్కటి వాతావరణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఇస్లామిక్ శైలితో అనేక భవంతులు దక్కన్ లొ వున్నా చార్మినార్ హూందాతనం, గాంభీర్యం ఏ కట్టడానికీ లేదు. మక్కా మసీదు ఒక సువిశాలమైన నిర్మాణం. దీని పునాదిని సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా 1617 A.D. లో వేశాడు. దీనికి ఇంజనీర్ ఫైజుల్లా బేగ్ (Faizullah Baig), మేస్త్రీ రంగయ్య మసీదు నిర్మాణ పనులు మొదలు పెట్టారు. కాని దీని పూర్తి నిర్మాణానికి 77 సంవత్సరాలకాలం పట్టింది. విచిత్రంగా దీని నిర్మాణ పనులు ఔరంగజేబు రాజ్యాధికారం చేపట్టిన తర్వాత పూర్తయ్యాయి. వేలసంఖ్యలో కార్మికులు పని చేశారు. ఒక్కొక్క గూడు లాంటి కిటికి (niche) నిర్మాణానికి దాదాపుగా ఐదు సంవత్సరాలు పట్టిందని తెలుస్తుంది. వీటిని ఏక శిలలో నగిషీలు చెక్కారు. నగిషీలు చెక్కడానికి దాదాపుగా ఐదు వేలమంది కార్మికులను ఉపయోగించారు. ఫ్రెంచి యాత్రికుడు టావెర్నియర్ గోల్కొండను సందర్శించినప్పుడు మసీదు ఇంకా నిర్మాణ దశలోనే వుంది. అయినప్పటికీ ఈ ప్రపంచ యాత్రికుడు అసంపూర్తి దశలో వున్న మసీదు వైభవాన్ని చూసి విభ్రమానికి, ఆశ్చర్యానికి లోనై "ఈ కట్టడం పూర్తయినచో భారత దేశంలోనే ఒక అద్భుతమైన కట్టడంగా, పూర్తి ఆసియాలోనే ఉత్కృష్టమైన ప్రాసాదంగా నిలిచి పోతుందని" వ్యాఖ్యానించాడు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పిసినారి తనం చూపకపోతే ఈ రోజు మసీదుకు మినార్లు వైభవంగా ప్రకాశిస్తూ సుల్తాన్ మహమ్మద్ ఆకాంక్షల వెలుగులను ప్రసరింపజేసేది. ఐనప్పటికీ ఈ ప్రార్థనా మందిరం కుతుబ్ షాహిల గొప్పదనానికి నిలువెత్తు నిదర్శనం. ఈ రోజు కూడా గత స్మృతులను గుర్తుకు తెస్తూ ఈ మసీదుకు పునాది రాళ్ళు, పవిత్రమైన హస్తాలు, మత విశ్వాసం కలిగిన మహనీయుడి చలువగా ప్రతిధ్వనిస్తాయి. ఇరవైనాలుగు గంటలూ ప్రార్థనలతో పవిత్రంగా అలరారే ఈ మసీదు ఆరాధకులకు ఒక పవిత్రమైన వరం లాంటిది. అందుకే ఈ మసీదుకు 'మక్కా మసీదు' గా పేరు సార్థకమైంది. అప్పటి