Jump to content

పుట:గోల్కొండ చరిత్ర.pdf/322

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భాగీరథి (Bhagirathi). ఈమె ఇబ్రహీం కుతుబ్ షాకు భార్య. మహమ్మద్ కులీ కుతుబ్ షాకు తల్లి. చరిత్రలో భాగమతి అనే అమ్మాయి ప్రస్తావన వాస్తవం కాదు. తరువాత చరిత్ర కారులు రాసిన భాగ్యనగర్ విషయాలు, మొఘల్ రచయితలు రాసిన విషయాలు కూడా సందేహాస్పదమే. సమకాలీన రచయితలే కాదు, స్వయంగా మహమ్మద్ కులీ కుతుబ్షా, హైదరాబాద్ నగర వ్యవస్థాపకుడు తన కవితల్లో, పద్యాల్లో హైదరాబాద్ లేదా 'షహర్ - ఎ - హైదర్' అని ప్రస్తావిస్తాడు కాని ఎక్కడా భాగ్యనగర్ అని చెప్పడు. కేవలం మొఘల్ చరిత్రకారులు, విదేశీ యాత్రికులు మాత్రమే 'భాగ్యనగరం' అని పిలిచేవారు. అందుకే భాగమతి అన్న కథ కేవలం పుక్కిట పురాణమని, అవాస్తవిక సంఘటనల ఆధారంతో తప్ప చారిత్రాత్మకమైన సాక్ష్యాధారాలు లేనిది, నిజం కాదని అంటారు.

ఒకవేళ భాగమతి ఉనికి వాస్తవమైతే 'ఫరిస్తా' (Farishta) ప్రకారం ఆమె తక్కువ జాతికి చెందిన స్త్రీయని, వ్యభిచారిణి అని, ఖఫి ఖాన్ అమెను ఒక 'నృత్యాంగన' (dancing girl) అని అంటారు. ఏది ఏమైనా ఎక్కడా భాగమతిని రాణిగా గుర్తించిన చారిత్రక సంఘటనలు కానరావు. ఫరిస్తా, ఖఫిఖాన్ లు మరో చోట ఇలా రాస్తారు “రాజు తన తప్పులను గ్రహించి విచారిస్తాడు. ఆమె (భాగమతి) మరణం తర్వాత 'హైదరాబాద్' అని తిరిగి నామకరణం చేశాడని చెప్పారు. ఖఫీఖాన్ ప్రకారం నిజానికి రాజు పట్టమహిషి, షా మీర్జా ఇస్పహాని తబాతబా (Shah Mirza Isfahani Tabataba) కూతురు అని, కుతుబ్ షాహి వివరణ ప్రకారం మీర్ షా మీర్ కూతురు అని తెలుస్తుంది. రాజుకు 'హయత్ బక్షీ బేగమ్' అనే కూతురు వుండేది. రాజు మామగారు షా మీర్జా, పేష్వా పదవి అలంకరించినా, ఆ పదవిని సమర్థవంతంగా నిర్వహించకపోవడంతో పేష్వా పదవినే కాదు, గోల్కొండనే వదలి 'ఆస్ఫహాన్' తిరిగి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అతని స్థానాన్ని 'మీర్ మోమిన్' భర్తీ చేశాడు.

కారణాలేవైనా హైదరాబాద్ నగర నిర్మాణానికి, మహమ్మద్ కులీ కుతుబ్ షా, గోల్కొండ కిరీట ధారణయైన పన్నెండు సంవత్సరాల పిదప, శంకుస్థాపన జరిగింది. భాగ్యనగరం లేదా హైదరాబాద్ నగర నిర్మాణానికి 1590 A.D. (999 A.H.) పునాది రాయి పడడం ఆంధ్ర దేశానికి మరిచిపోలేని ఒక శుభ సందర్భం. పౌర జీవనం, సామాజిక వికాసం చెందటానికి సంవత్సరాలు పట్టింది. హైదరాబాద్ నగర నిర్మాత ఉన్నతమైన అభిరుచులమేరకు, నగర రూప నిర్మాణ ప్రణాళిక అద్భుతమైన పద్ధతిలో శాస్త్రీయంగా రూపొందించబడింది. విశాలమైన రహదార్లు,