Jump to content

పుట:గోల్కొండ చరిత్ర.pdf/319

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏర్పడింది. తెలుగును బాగా అర్థం చేసుకోవడమే గాక కవుల, పండితుల ద్వారా విశ్లేషించబడిన విషయాలను అవగాహనలోకి తీసుకోగల సామర్థ్యం వున్నవాడు. ఉర్దూ, పర్షియన్ కవుల మాదిరిగానే ఇతని దర్బార్ లొ ప్రముఖ తెలుగు కవులు వుండేవారు. వీరిపై రాజు ప్రత్యేకమైన గౌరవభావం, అభిమానం చూపేవాడు. అలా రాజు అభిమానం పొందిన వారిలో తెలుగు కవి శ్రేష్టుడు, సాహితీ దిగ్గజం అద్దంకి గంగాధర్. ఇతని రచన 'తపతి సంవర్ణం - వ్యాఖ్యానం'. చాలా ప్రసిద్ది పొందినది. పొన్నగంటి తెలగనార్య 'యయాతి చరిత్ర' కూడా బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన రచన. ఇతను పటాన్ చెరు వాసి.

మహమ్మద్ కులీ కుతుబ్ షా, కుతుబ్ షాహి వంశానికి దీపస్థంభం లాంటివాడు. ఆంధ్రదేశం సేవలో తన జీవితాన్ని, ఆత్మను లీనం చేసినవాడు. పూర్తిగా తెలంగాణ వాసిగా జీవితాన్ని గడిపాడు. 'మహానామ' సంపాదకుడు స్వయంగా మహమ్మద్ కులీని ప్రస్తావిస్తూ 'అతని నరనరాల్లో తెలుగు రక్తమే ప్రవహిస్తుంది' అని వ్యాఖ్యానించాడు. తెలంగాణ పట్ల అతని అభిమానం, సైద్దాంతిక విలువలతో కూడిన అతని చరిత్ర శ్లాఘనీయం. జాతీయ భావనతో నిర్మాణాత్మక చింతనతో తెలుగును ఒక ఉన్నత స్థానానికి చేర్చిన ఘనత మహమ్మద్ కులీది. ఇతను తెలుగులో కూడా కవిత్వం రాశాడని ప్రచారంలో వుంది. కానీ ఏవీ కూడా లభ్యం కాలేదు. ఇతని ఉర్దూ కవిత్వంలో కూడా మధ్య మధ్యలో తెలుగు పదాలు, వాక్యాలు దొర్లేవని చరిత్రకారులు తెలుపుతారు. అంతేకాదు, ఉర్దూ కవిత్వంలో హిందువుల పండుగలు, సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన విషయాల ప్రస్తావన కూడా వుంటుంది. అలా అతని కవిత్వం ఇస్లాం, స్థానిక సాంప్రదాయాల మేలుకలయికగా వుంటుంది. అబ్ధుల్లా కాలంలో కేశవరాజు అనే కవి వుండేవాడు. అతను 'తెలుగు పదాలు' అనే పుస్తక రచన చేశాడు.

చివరగా, కుతుబ్ షాహిల కాలంలో మత పెద్దలు, సూఫీ పండితులు, తెలుగు సంస్కృత భాషలు నేర్చుకుని గ్రంథ రచనలు చేశారు. హజ్రత్ షా రాజు (Hazrat Shah Raju) కుమారుడైన షా అక్బర్ హుసేని అలియాస్ 'హజ్రత్ బడే సాహిబ్' (Shah Akbar Husaini alias Hazrat Bade Sahib) సూఫీ పండితుడు, విద్యావంతుడు. ఇతను తెలుగులో 'శృంగార మంజరి' అనే గ్రంథాన్ని రచించాడు. ఇందులో విభిన్న మనస్తత్వం గల స్త్రీల మనోభావాలను, సంవేదనలను వ్యక్తీకరిస్తాడు. ఇదే పుస్తకాన్ని షా అక్బర్ సంస్కృతంలో కూడా అనువదించాడు. ఈ పుస్తక రచనలే, ఏ విధంగా కుతుబ్ షాహీల పాలనలో ముస్లింలు తెలుగు భాషను, సంస్కృతిని, సాహిత్యాన్ని ఎంతగా ఆదరించారో, ప్రోత్సహించారో చూపడానికి గొప్ప ఉదాహరణలు.