అబ్దుల్లా కుతుబ్షా పాలనలో కూడా సాహిత్యం వెల్లువెత్తింది. తన పూర్వీకులమాదిరిగానే ఇతనికి సాహిత్యం పట్ల మక్కువ ఎక్కువ. ఎల్లప్పుడూ పండితులు, కవులతో పరివేష్టితమై వుంటాడు. ఇతని దర్బారులోని ప్రసిద్ధ కవులు, పండితులు - అల్లమ మీర్ ముజాదుద్దీన్ (Allama Mir Mujadduddin), మౌలానా రౌన ఖి (Moulana Rounaqui), ఖాజీ అహ్సన్ మీర్ మీరన్ (Ahsan Mir Miran), హకీం అబ్దుల్ జబ్బార్ గిలాని (Hakim Abdul Jabbar Gilani), షేక్ అబ్దుల్ లతీఫ్ (Sheikh Abdul Latif), నూరుల్లా (Noorulla), మీర్జా మహమ్మద్ జోహార్ తబ్రెజి (Mirza Mohd. Johar Tabrezi), మీర్జా హంజా అస్తరబాది (Mirza Hamza Astarabadi), మీర్ ఫజుల్లా షిరాజి (Mir Fazlullah Shirazi), షేక్ హరున్ (Shaikh Harun), ముల్లా తప్తాయి షిరాజి (Mulla Taphtai Shirazi), ముల్లా అరబ్ (Mulla Arab) - ఇతను చక్కని కాలిగ్రాఫర్ (calligrapher). పైన పేర్కొన్న కవులు, పండితులు, మేధావులు రాజుతో పగలు, రాత్రి తేడా లేకుండా ఉల్లాసంగా అనేక విషయాలపై చర్చలు జరిపేవారు. అబ్దుల్లా పాలనా కాలంలోని కుతుబ్ షాహిల చరిత్రను నిజాముద్దీన్ అహ్మద్ అనే అతను 'హదీ ఖతస్ సలాతీన్ కుతుబ్ షాహి' (Hadeeqatus salateen Qutub Shahi) శీర్షికతో రచించాడు. అల్లమ ఇబ్నె ఖాతూన్ అనేక గ్రంథాలను సమీక్షించి 'కితాబుల్ ఇర్షాద్' (Kitabul Irshad), 'జామె అబ్బాసి' (Jame Abbasi) శీర్షికలతో రెండు గ్రంథాల రచన చేశాడు. 'అర్బెన్' (Aabain) ను అనువదించాడు. అల్లమ జమాలుద్దీన్ 'అల్మాస్బీ', ముల్లా అలీ బిన్ తైపూర్ - 'ఐవాన్ - ఎ - అక్బర్ రజా' పర్షియాలో అనువదింపబడిన గ్రంథాలుగా ప్రసిద్ది చెందినవి. 'నేహజుల్ బలఘ' అనే గ్రంధంపై హుసేన్ అమెలి వ్యాఖ్యానం రాశాడు. ఇమామ్ యఫె అనే రచయిత ప్రసిద్ధ కృతిని/ గ్రంథం 'రౌజుర్ రియాహీన్' ను ముల్లా ఫజుల్లా సమ్మాని గానం చేశాడు. ఇబ్నె ఇమాద్ ఉత్తమ రచన 'కిర్కతుల్ ఉలేమా' అనేక అరుదైన శాస్త్ర విజ్ఞాన విషయాలు, కళలకు, సమాజానికి సంబంధించిన విషయాలతో నిక్షిప్తమై ఉండి కుతుబ్షాహిల కాలానికి తలమానికంగా నిలిచింది. పర్షియన్లో సంకలించిన 'బుర్హాన్ ఎ - ఖతే' అనే నిఘంటువు ఇంకా వాడుకలో నున్న ప్రసిద్ధ సృజన. సంకలనకర్తలలో ఒకరైన మహమ్మద్ హుసేన్ వివరణ ప్రకారం ఈ నిఘంటువుకు అబ్దుల్లా కుతుబ్షా పోషకుడిగా వ్యవహరించాడు.
పర్షియన్ భాషలో సుప్రసిద్ధుడైన గేయ కవి అహ్మద్ షాబుద్దీన్ అమెలి. ఇతను షేక్ బహావుద్దీన్ ద్వారా అరబ్బీ భాషలో రాయబడిన ప్రముఖ రచన 'అల్కష్ కొల్'ను పర్షియా భాషలో రాజు అబ్దుల్లా కోరిక మేరకు అనువదించాడు.