పర్షియన్ భాషలో కూడా ప్రావీణ్యం సంపాదించగలిగారు. రాజ్యంలో అప్పుడు పర్షియన్ అధికార భాషగా వుండేది. ఇందుకు చక్కటి ఉదాహరణగా మాదన్న, అతని కుటుంబ సభ్యులను చూడవచ్చు. మాదన్న, అతని పరివార జనమంతా పర్షియా భాషను, లిపిని చక్కగా చదివి అర్థం చేసుకోగల సామర్థ్యం గలవారు. రాజు గారి ఫర్మానాలను చదివి, విశ్లేషించ సత్తాగల వ్యక్తులు మాదన్న, అక్కన్నలు. కుతుబ్షాహీల పాలనలో పర్షియాతో బాటు స్థానిక దక్కనీ భాషలు, ప్రత్యేకంగా తెలుగు చక్కటి ఆదరణను పొందాయి.
సుల్తాన్ కులీ పాలనా కాలంలో గోల్కొండ రాజ్యం ఇంకా అభివృద్ధి లేదా ప్రారంభ దశలోనే వుండటంచే అధిక సమయాన్ని రాజకీయ, సైనిక, రక్షణ వ్యవస్థలపైనే కేటాయించడంతో విద్య, సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రధాన స్రవంతిలోకి రాకుండా పోయాయి. సుల్తాన్ కులీ తరువాత సింహాసనం అధిష్టించిన జమీద్ కూడా శాంతి భద్రతలు, రక్షణ వ్యవస్థల విషయంలో శ్రద్ధ తీసుకోవడం చే అతనికి సాహిత్యం, కళలమీద అభిమానం వున్నా సమయం కేటాయించడం కష్టమై పోయేది. ఇబ్రహీం కులీ కుతుబ్షా రాజ్యాధికారానికి రాగానే గోల్కొండ డిఫెన్స్పరంగా, రాజకీయ పరంగా బలోపేతం కావడంతో తిరిగి సాంస్కృతిక, సాహిత్య కార్యక్రమాలు చైతన్యవంత మయ్యాయి. ఇక మహమ్మద్ కులీ, సుల్తాన్ మహమ్మద్ పాలనా కాలంలో మూడు పువ్వులు ఆరు కాయలుగా విలసిల్లింది. సారాంశంగా చెప్పాలంటే కుతుబ్షాహిలకున్న పాండిత్య ప్రకర్ష అంతా వీరిద్దరి పాలనలోనే వెలుగు చూసింది. శత్రురాజ్యాల దాడుల, ఆక్రమణల మధ్య, విశ్వాస పాత్రులైన వారు అవసర కాలంలో నమ్మకద్రోహం తలపెట్టి రాజకీయ సంక్షోభాలనుసృష్టించి రాజ్యాన్ని, ప్రజల జీవితాలను అల్లకల్లోలం చేసిన గడ్డు సందర్భాలలో సైతం వీరు తమ ఉత్కృష్టమైన అభిరుచులను వదులుకోలేదు. సామాజిక, రాజకీయాల మధ్య వున్న సామరస్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చారు. చివరి దశలో, సంక్షోభ సమయాలలో నిర్బంధంలో వున్నా, రాజులు కవిత్వాన్ని ఆరాధించారు. కులీ కుతుబ్షా అనేక సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలనుండి ఉపసంహరించుకున్నా, రాజధాని లో పండితుల, సాహితీ వేత్తలకు కొదువ లేకుండా పోయింది. నిజం చెప్పాలంటే వీరంతా కలిసి 'ఆషానా' (Aash khana) అనే సాహితీ సంస్థను స్థాపించి అక్కడ సాహితీ వేత్తలందరూ సమావేశమయ్యేవారు. జమ్ద్ కులీ కుతు, 'జమీద్' కలం పేరుతో అనేక రచనలు చేశాడు. చాలాసార్లు ఆశువుగా కవిత్వం చెప్పాడు. ఒకానొక సందర్భంలో 'నిజాం షా' తరపున అతనికి సత్కారం జరిగినప్పుడు కృతజ్ఞతా పూర్వకంగా, ఆశువుగా అద్భుతమైన కవితను వినిపించాడు. అధికారిక కార్యక్రమాల హడావుడి తగ్గినప్పుడు, దూరంగా,