Jump to content

పుట:గోల్కొండ చరిత్ర.pdf/310

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అధ్యాయం-21

శాస్త్ర విజ్ఞానం, సాహిత్యం, కళల పురోగతి

(The Advancement of Learning)

గోల్కొండ రాజ్యంలోని కుతుబ్షాహి రాజులు స్వచ్ఛమైన శాస్త్రవిజ్ఞాన, సాహిత్య కళాపోషకులు. కళలకు, సాహిత్యానికి కుతుబ్షాహీలు అందించిన అమూల్యమైన సేవలు మరువరానివి. భావితరాలకు అందించిన అపారమైన జ్ఞాన సంపద ఎన్నటికీ ఉపేక్షకు గురికాని విలువలతో కూడుకున్నవి. దక్కన్ నేలలో విస్తరించిన సాహితీ కార్యక్రమాలు బహమనీ రాజుల వారసత్వమన్నది వాస్తవం. సాహిత్యం పట్ల వారికున్న అభిరుచి, మక్కువ దక్కన్ నేలను జ్ఞానదీపంతో ప్రకాశింపజేసింది. గోల్కొండ రాజులలోని సాహిత్యం పట్ల అభిరుచి బహమనీ రాజుల వారసత్వమని చెప్పుటలో సందేహం లేదు. కుతుబ్ షాహి వంశస్థాపకుడైన రాజు కూడా తుర్కిస్థాన్లోని సంస్కార వంతమైన ఉన్నత వంశానికి చెందిన వ్యక్తి, మేధావి కావడంతో అతనికి కూడా విద్య, సాహిత్యం, కళలపట్ల అభిమానం మెండు. గోల్కొండ రాజ్యస్థాపన కాలం నుండే తెలంగాణ, సాహితీ కార్యక్రమాలకు ముఖ్య కేంద్రంగా మారి హైదరాబాద్ నగరం విద్యా సంస్థలకు నిలయంగా రూపు దిద్దుకుంది. మినహాయింపు లేకుండా గోల్కొడ రాజులందరూ కళారాధకులు కావడంతో కవులు, సాహితీవేత్తలు వారితో అనుకూల వాతావరణాన్ని, స్నేహబంధాలతో ఆనందించసాగారు. రాజులు కూడా కవిత్వాన్ని ఔపోసన పట్టారు. గద్య రచనలు చేశారు. తెలుగు భాషాభిమానులై వారి స్వంత మాతృభాషగా తెలుగును గౌరవించారు. ఫలితంగా తెలంగాణ అంతటా చక్కటి సాహితీ వాతావరణం ఏర్పడి కళలు, సాహిత్యం ప్రజల జీవితాల్లో రివాజుగా మారింది. అధికార వర్గానికి చెందిన ముస్లింలు, ముస్లిం ప్రజలు విద్యా ప్రగతి బాటలో నడిచి అనేక గ్రంథాలయాలను కూడా స్థాపించారు. హిందూ ప్రజలు కూడా ఆదర్శప్రాయంగా వుంటూ చదువులపై శ్రద్ధ చూపుతూ రాష్ట్రంలో ఉన్నత వుద్యోగార్హతలు సంపాదించడానికి మౌలిక సూత్రమైప మూడు R's (Three R's:- Reading, writing, Arithmetic) లు సాధించడానికి కష్టపడేవారు. సంతోషకరమైన విషయమేమిటంటే హిందువులు తమ స్థానిక భాషలతో పాటు