కాకుండా జాగ్రత్తలు తీసుకునేవారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా వజ్రాల దొంగతనాలు జరిగేవి. గనులు సామాన్యంగా వర్తకులకు, కాంట్రాక్టర్లకు 'లీజు' మీద ఇచ్చి ప్రభుత్వం 'రాయల్టీ' వసూలు చేసేది. గనులనుండి తీసిన వజ్రాలను మార్కెట్లో అమ్మకానికి పెట్టేవారు. లీజుకు తీసుకున్న వ్యక్తి 'రాయల్టీ' రూపంలో వజ్రాల లభ్యత తో సంబంధం లేకుండా ఒక్కొక్క గనికి గంటకు ఒక హుణా (హున్) ఇచ్చే విధంగా ఒప్పందం వుంటుంది. ఏడాదికి కూడా 'లీజు' ఇచ్చే విధానం వుంది. ఇందులో సంవత్సరానికి మూడు లక్షలహుణాలను ముట్ట జెప్పాలి. గోల్కొండ, ఇనుప ధాతువుకు కూడా ప్రసిద్ధి. ఇక్కడి ఇనుప ధాతువు పంజాబ్, పర్షియా దేశాలకు ఎగుమతి అయ్యేది. డమాస్కస్లో కత్తుల (swords) తయారీకి వాడేవారు. గోల్కొండ ఇనుము నాణ్యతలో ఉత్కృష్టమైనది కావడం చేత వీటితో తయారు చేయబడిన కత్తులు 'డమాస్కస్ కత్తులు'గా ప్రపంచ ఖ్యాతి పొందాయి.
గోల్కొండ వ్యవసాయిక రాజ్యం అని చెప్పడంలో సందేహం లేదు. అలాగని వర్తక వ్యాపారాలు, పరిశ్రమలు లేవని కాదు. కుతుబ్ షాహిల సంస్కృతి ఆగమనంతో వాణిజ్య, పరిశ్రమలకు ఊతం లభించినట్లయింది. రాజ కుటుంబాలకు, ధనిక వర్గాలకు, సామాన్య ప్రజల అవసరార్థం కావలసిన అన్ని రకాలవస్తువులు నైపుణ్యంతో తయారు చేసి అందించగల పనివాండ్రు, కళాకారులు వున్నారు. చరిత్ర కారులు రికార్డు ప్రకారం హైదరాబాద్ నగరానికి వందల సంఖ్యలో వృత్తి పనివారు, వర్తకులు, కళాకారులు రావడం, పరిశ్రమలు అభివృద్ధి చెందడంతో నగర సంస్కృతి పెరిగి శోభాయమానంగా మారింది. గోల్కొండ, వస్త్ర పరిశ్రమకు కూడా పేరు పెట్టింది. అనేక రకాలైన నూలు వస్త్రాల తయారీ, నాణ్యత కలిగి, విలువైన, అందమైన వస్త్రాల తయారీకి గోల్కొండ ప్రసిద్ధి. నేత కర్మాగారాలు వుండక నేత కార్మికులు తమ ఇండ్ల వద్దనే నేసే వారు. చాలా వరకు ప్రజలు ముందస్తుగా డబ్బు చెల్లించి తమకు నచ్చిన రీతిలో, నాణ్యతలో వస్త్రాలు నేయించి అవసరానికి తగినట్లు కొనుగోలు చేసేవారు. నేత వస్త్రాలు సాదా - సీదాగాను, రెండవ రకం నాణ్యత కలిగి ఆధునికంగా, ఫ్యాషన్గా వుండేవి. సాదా బట్టలు నూలు దారాలతో (Linen or Tanzeb) నేయబడి పల్చగా వుంటాయి. ఈ వస్త్రాలు వరంగల్లో ఎక్కువగా నేయబడేవి. మరో రకం ఫ్యాషన్స్ రకరకాల నమూనాలు, డిజైన్లతో, రంగులతో వుండి 'చిట్' (chit) లేదా చింట్ (chint) గా పిలువబడుతూ ఎక్కువ ధరతో అమ్మకానికి వుంటాయి. సాదా బట్టలపైన డిజైన్ల ప్రింటు వేసి 'కలంకారి' పేరుతో కళాత్మకంగా వుంటాయి. వీటిపైన వేసిన ప్రింట్ల రంగులు వెలిసిపోకండా చాలా