Jump to content

పుట:గోల్కొండ చరిత్ర.pdf/301

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అధ్యాయం-20

ఆర్థిక స్థితిగతులు

(The Economic Conditions)

గోల్కొండ సారవంతమైన భూములతో, ఖనిజవనరులతో అలరారే విశాలమైన రాజ్యం. నైసర్గిక స్వభావాలు, నేలరకాల నాధారంగా చేసుకొని రాజ్యాన్ని రెండు భాగాలుగా చూడవచ్చు. కోరమండల్ తీరప్రాంతం, దానికి సమానంగా కృష్ణా, గోదావరులు ప్రవహించే సారవంతమైన ప్రాంతాలు, నదీపరీవాహక ప్రాంతాలు. రెండవది, అంతర్భాగంలోనున్న తూర్పు కనుమలు, దక్కన్ పీఠభూమి నేలలు. ఉత్పత్తికి అనువుగా నున్న సారవంతమైన భూములను చూసి ఔరంగజేబు "బీడుపడిన నేలలు మచ్చుకైనా కానరావు" అన్నాడు. విదేశీ యాత్రికులు కూడా ఇక్కడి నేలను చూసి ముగ్ధులయ్యారు. వ్యవసాయానికి, భూమిశిస్తుకు (land revenue) సంబంధించి సరియైన వ్యవస్థ లేకపోవడంచే, ఎదురైన సమస్యలు, కాలక్రమంలో పరిపాలన రంగం మెరుగుపడటంతో సమస్యలు తగ్గుముఖం పట్టాయి. నిర్జన గ్రామాలు, గ్రామీణులతో నిండిపోయాయి. కొత్తగా చెరువులు, బావులు నిర్మించబడినాయి. రాజ్యంలో పప్పు, చిరుధాన్యాల పంటల దిగుబడి పెరిగింది. గోధుమలు, వరి, చిరుధాన్యాలు, పప్పుదినుసులు, కంది, పెసర, నువ్వుల పంటలు సమృద్ధిగా దిగుబడి నిచ్చాయి. వాణిజ్య పంటలైన పత్తి, పొగాకు, ఆముదపు విత్తనాలద్వారా ఆదాయం, రాబడి పెరిగింది. అంతేకాదు ఈత, తాటి చెట్లనుండి వచ్చిన కల్లు కూడా ప్రధాన పాత్ర పోషించేది. మామిడి, అరటి, నిమ్మ, దానిమ్మ, బత్తాయి, జామ, పనస తోటలకు కొదవలేదు. అడవుల ద్వారా కూడా మంచి ఆదాయం వచ్చేది. వెదురు, అడవి జంతువులు మంచి వనరు. పులులు, ఏనుగులు, ఎలుగుబంట్లు, చిరుతలు, జింకలు, కోతులు తెలంగాణ అడవుల్లో సాధారణంగా సంచరించే జంతువులు. అలా రాజ్యంలోని ఆరు ప్రానిన్స్లు, ఆర్థిక వనరులు కలిగివున్నాయి. ఈ ఆరు ప్రావిన్స్లలో 37 జిల్లాలు (సర్కార్లు), ఈ జిల్లాల్లో 517 పరగణాలు (తాలుకాలు) వుండేవి.