Jump to content

పుట:గోల్కొండ చరిత్ర.pdf/299

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విరోధించాడు. ఇబ్రహీం కుతుబ్ షా, విశ్వజనీనమైన ఆలోచనలు కలిగినవాడు. అతని భార్యల్లో ఒకరు వేరే తెగకు చెంది, గుల్బర్గాలోని గౌరవనీయ కుటుంబం నుండి వచ్చిన స్త్రీ. ఆమె ద్వారా అతనికి ఒక కుమారుడు, షా అబ్దుల్ ఖాదర్ జన్మించాడు. తన కుమార్తెలను సున్ని తెగకు చెందిన యువకులకిచ్చి వివాహం జరిపించాడు. హుసేన్ షా వలీ (Husain Shah Wali), షా కుత్బుద్దీన్ లాంటి ప్రముఖ సూఫీలు ఇతని అల్లుళ్ళు. కాని మహమ్మద్ కులీ కుతుబ్షా పాలన ఈ విధానాలకు కాస్త భిన్నంగా నడిచింది.

దురదృష్ట వశాత్తు మహమ్మద్ కులీ కుతుబ్ షా మత సిద్ధాంతం, విధానాలు తన పూర్వీకులకు భిన్నంగా వుండింది. విశాలదృక్పథం లేని మహమ్మద్ కులీ, హిందువులపట్ల మతపరంగా స్వేచ్ఛగా వున్నా, ఇస్లాం మతం లోని షియా వర్గాన్ని తప్పించి ఇతర తెగలవారితో వివక్ష చూపేవారు. షియా విధానాలంటే అమితమైన విశ్వాసం, భక్తి. ఇతర తెగలపై సంకుచిత స్వభావం కలిగి వుండేవాడు. 'మొహరం' వచ్చిందంటే 'ఆలం' పీర్లను కూర్చోబెట్టి చాలా నిష్టగా సంతాప దినాలు పాటించేవాడు. ఇప్పటికీ అతను మొహర్రం రోజులలో పాటించవలసిన నిర్దేశాలు కొనసాగుతూనే వున్నాయి. గోల్కొండ లోని 'హుస్సేని ఆలం' మొట్టమొదటగా అతను ఏర్పాటు చేసినదే. సున్నీలను తన కవితల్లో కూడా విమర్శించే వాడు. సున్నీలంటే ద్వేషభావం కలిగి షియాలకు అనేక సౌకర్యాలు కల్పించేవాడు. మతపరంగా మహమ్మద్ కులీ పర్షియా మత విధానాలను అనుకరించేవాడు. అంతేకాదు, ఇతను పర్షియా రాజుతో దౌత్య సంబంధాలు నెరిపిన మొదటి గోల్కొండ రాజు. పర్షియా రాజును తన నాయకుడిగా భావిస్తాడు. పర్షియన్లు అనేకులను ఆహ్వానించి హైదరాబాద్ లో స్థిరపడటానికి అవకాశాలు కల్పించాడు. షియా వారిని నమ్మడం, వారిపైనే విశ్వాసం కలిగి వుండడం అతని నైజంగా మారింది. దానితో హైదరాబాద్, షియా వలసవాదుల స్థావరంగా మారి అనేక అవకాశాలు చేజిక్కించుకుని హైదరాబాద్, మచిలీపట్నం లాంటి నగరాల్లో అటు వ్యాపార సంస్థలు, ఇటు బ్యాంకింగ్ వ్యవహారాలలో షియాలు పెత్తనం చెలాయించారు. చాలా వరకు ఇప్పుడు హైదరాబాద్, మచిలీపట్నం నగరాల్లో నివసించే షియా కుటుంబాల మూలాలను అన్వేషిస్తే వారు మహమ్మద్ కులీ పాలనా కాలంతో సంబంధం కలిగి వుంటారు.

మత సంబంధ వైరుధ్యాలవలన అనేక సంక్లిష్టతలు పొడసూపాయి. సున్నీతెగకు చెందిన ప్రజల్లో వ్యతిరేకత పెరిగి మత ఛాందసవాది, పక్షపాతియైన రాజు పాలనకు విరుద్ధంగా తిరుగుబాటు మొదలయ్యింది. మహమ్మద్ కులీ, అతని ఇద్దరు సోదరులు షా అబ్దుల్ ఖాదిర్, ఖుదా బందా నాయకత్వంలో జరిగిన రెండు