కులీ కుతుబ్ షా పర్యవేక్షణలో వుండగా, వరంగల్ కు ఆవలవున్న తూర్పు జిల్లాలు మహమ్మద్ షా లష్కరి ఆధీనంలో వుండేవి. అతని మరణం తర్వాత తిరిగి సుల్తాన్ కులీ పర్యవేక్షణలోకి వచ్చి చేరాయి. సుల్తాన్ కులీ భుజాలపై రాజ్య విస్తరణ భారం వుండేది. తన ప్రణాళిక విజయవంతంగా రూపు దాల్చడానికి అరవై సంవత్సరాలు పట్టిందని స్వయంగా కులీ వివరించాడు. కొత్తగా ఉద్భవించిన గోల్కొండ రాజ్యానికి అప్పటి సమకాలీన రాజ్యాలైన అహ్మద్ నగర్ ఉత్తరాన, బీజాపూర్ పశ్చిమాన, దక్షిణాన విజయనగరం పరివేష్టితమై వుండేవి. శక్తివంతమైన ఈ రాజ్యాలద్వారా అంతర్ రాష్ట్ర యుద్ధాలభయం వుండేది. శక్తివంతమైన పొరుగు రాజ్యాలమధ్య తన ఉనికిని కాపాడుకోవాలంటే సమర్థవంతమైన సైనిక బలం అవసరం. దక్కన్ పీఠభూమిలో తరుచుగా పొరుగు రాజ్యాలతో యుద్ధాలు జరుగుతూ వుంటాయి. అంతేకాదు, 1565 A.D. లో 'తాళికోట' యుద్ధంలో భాగస్వామ్యం పంచుకోవలసి వచ్చింది. దానికి తోడు విజయనగర పతనంతో గోల్కొండ, బీజాపూర్ కు సైనిక చర్యలకు సంసిద్ధం కావలసి వచ్చింది. కర్నాటకలోని అనేక సారవంతమైన ప్రాంతాలు, ఇబ్రహీం, ఆ తరువాత అబ్దుల్లా పాలన వరకు గోల్కొండ పరిధిలోకి వచ్చాయి.
కుతుబ్ షాహి రాజ్యంలో కచ్చితంగా ఇంత సంఖ్యతో సైనిక బలం వున్నదన్న లెక్క అందుబాటులో లేదు. సుల్తాన్ కులీ తన అరవై సంవత్సరాలపాలనా కాలంలో రాజ్యం లోపల, బయటా, గవర్నర్ , రాజుగా వుండి అనేక గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నాడు. రాజ్య విస్తరణ చర్యలో భాగంగా క్షేత్ర పరిధిని వరంగల్ నుండి మచిలీపట్నం వరకు విస్తరింపజేయడమే గాక తనకు ప్రారంభ దశలో పోషకులుగా వున్న మహమ్మద్ షా బహమనీ కి అండగా నిలిచి బహమనీ ప్రభుత్వానికి సమయానికి తమ సైనిక బలగాన్ని సహాయంగా అందించాడు. జమీ షీద్, శక్తివంతమైన రక్షణ వ్యవస్థ కారణంగా అనేక సందర్భాల్లో సమస్యలను అధిగమించాడు. రాజ్యాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన ఇబ్రహీం కుతుబ్ షా కుమారుడు మహమ్మద్ కులీ కుతుబ్ షా పాలన 1550 A.D. నుండి సైన్యం కొత్త శక్తిని, బలాన్ని పుంజుకుని రాజ్యానికి రక్షణగా నిలిచాయి.
పదహారవ శతాబ్ది మధ్య కాలంలో ఉత్తరాదిలో మొఘల్ శక్తుల ప్రాబల్యం పెరిగి పోతుండటంతో కుతుబ్షాహీలు కొత్త సమస్యల నెదుర్కోవడంతో పాటు తమ రక్షణ పథకాల్లో కూడా కొత్త మార్పులు చేసి పరిస్థితులకనుగుణంగా మెరుగు పరుచుకోవలసి వచ్చింది. అహ్మద్ నగర్ పై దాడికి దుందుడుకుతనంతో ముందుకు సాగిన మొఘల్ సేన, ఆ తరువాత అహ్మద్ నగర్ పతనం, దక్షిణాదిలో