Jump to content

పుట:గోల్కొండ చరిత్ర.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వ్యాపించింది. చివరికి 823 A.H. (1420 A.D.)లో ఇతను చనిపోయాడు. తరువాత యూసుఫ్ కుమారుడు సికందర్ -IIగా పిలవబడే అమీర్ జాద సికందర్ రాజ్య భారాన్ని స్వీకరించాడు. జహా షా, సికందర్ సోదరుడు. సికందర్, అతని కుమారుడు కై- ఖుబద్ (Kai-khubad) చేతిలో హత్య కావించబడిన తరువాత జహా షా అధికారంలోకి వచ్చాడు. షారుక్ మీర్జా 850 A.H. (1446 A.D.)లో మరణించిన తదుపరి ఇరాక్ను పూర్తిగా ఆక్రమించి 857 A.H. (1453 A.D.) లోగా తిరుగులేని నాయకుడిగా జహా షా ఎదిగాడు. 'తాజోషి' రాజ్యాభిషేకం అయిన తరువాత తన స్వంత కరెన్సీని చలామణిలోకి తెచ్చాడు. 'కుత్బా'లో తన పేరు ప్రస్తావించబడేట్లు చేసుకున్నాడు. అతని రాజ్య విస్తీర్ణత అజర్బైజాన్ నుండి ఒమన్ నది వరకు విస్తరించింది. 859 A.H. (1454 A.D.) లో బాగ్దాద్ను ఆక్రమించుకున్నాడు. 862 A.H. (1457 A.D.)లో షారుక్ కిరీటాన్ని స్వాధీన పరుచుకున్నాడు. కారా ఖునిలు తెగ తమ వంశ కీర్తిపతాకం అత్యున్నత స్థాయికి ఎదిగిన దశ. ఇంత ఉన్నత స్థాయికి ఎదిగినా, అధికార వైభవం వున్నా తనకు విరోధులుగా వున్న అల్వాంద్ (Alwand), కై - ఖుబద్ రాకుమారు లంటే కాస్త జంకేవారు. వీరిద్దరూ సికందర్ II కుమారులు. వీరితో జాగరూకతతో వ్యవహరిస్తూ బహిరంగ సంఘర్షణలకు దిగేవాడు కాదు. ఎప్పుడైతే కై-ఖుబద్ మరణించాడో, జహా షా, అల్వాంద్ను తన పూర్వీకుల ప్రాంతం హమాన్కు పాలకుడిగా నియమించాడు. అంతేగాకుండా తన స్వంత మనవరాలు ఖాదీజా బేగంను (యూసుఫ్ కూతురు) ప్రిన్స్ అల్వాంద్ కుమారుడు పీర్ కులీబేగ్కు ఇచ్చి వివాహం జరిపించాడు. ఈ దంపతులకు ఇద్దరు కొడుకులు. ఒవైస్ కులీ, అల్లాహ్ కులీ. వీరిలో ఒవైస్ కులీ తన తండ్రి హమాన్ సింహాసనాన్ని వారసత్వంగా అధిష్టించాడు. హమాన్లోని ఒక సంపన్నుడైన, ఉన్నత వంశస్థుడైన మాలిక్ సలేహ కూతురు మరియం ఖాతూన్ ను ఒవైస్ కులీ వివాహమాడాడు. చివరికి వారి వంశంలో సుల్తాన్ కులీ - గోల్కొండ రాజ్య వ్యవస్థాపకుడు - మిగిలి వుంటాడు. తన పేరు 'సుల్తాన్ కులీ'గా మారడానికి తన తాత మాలిక్ సలేహకు గౌరవం ఇస్తాడు. కొందరు చరిత్ర కారులు ఇతన్ని మహమ్మద్ కులీగా పిలిచారు. కానీ ఇది వాస్తవం కాదని తెలుస్తోంది.

ఈ సంశోధన వల్ల తెలిసేదేమంటే సుల్తాన్ కులీ వైభవంగా వెలుగొందిన తుర్కిస్తాన్ పాలక వంశానికి చెందిన వాడుగా వ్యక్తమవుతున్నది. అంతేకాదు,