సోదర రాజ్యాలతో సహకరించి ఒక బలమైన కూటమిగా, ఉత్తరాది శక్తుల నిలవరించడానికి ఎదగడంలో తోడ్పడింది. అనేక అత్యవసర సందర్భాల్లో అబుల్ హసన్, మరాఠా నాయకుడైన శంభాజీతో కలిసి రాజకీయ మిత్ర పక్షంగా వుండాలన్న ఆకాంక్షను తెలిపి బీజాపూర్కు సహాయమందించాడు. మరాఠాలు హిందూ శక్తియైనా, దక్షిణ రాజ్యాలు ఏకమై వుండాలన్న ఏకైక లక్ష్యమే మరాఠాలను విశ్వసించాల్సిన పరిస్థితులను కల్పించింది. బీజాపూర్ చరిత్రకారుడు, జుబైరి, బీజాపూర్ రాజ్య సంబంధ విషయాలలో అబుల్ హసన్ తీసుకున్న శ్రద్ధను ఎంతో సవివరంగా విశదీకరించాడు.
అబుల్ హసన్ ఔదార్యం, విశాలదృష్టి, రాజకీయ నైతికత, వీటన్నింటిని మించి పరమత సహనం, తన ప్రజలపట్ల ప్రేమ, గౌరవం ఈ ఉదాత్త లక్షణాలన్నీ గోల్కొండ ప్రజల అభిమానాన్ని చూరగొన్నాయి. అతను పాలించినంత కాలం గోల్కొండ రాజ్యం హసన్ అంటే అమితమైన అభిమానం చూపి ఆదరించాయి. తన వ్యక్తిగత స్వభావాలతో చరిత్రలో చెరగని ముద్ర వేసి మరణానంతరం కూడా గోల్కొండ ప్రజల మనసుల్లో నిలిచిపోయాడు. అతని జ్ఞాపకాలు ఆంధ్ర ప్రజల హృదయాల్లో ఒక సాధువుగా, రుషిగా ఇప్పటికీ ప్రకాశిస్తూ వుంటాయి. శుభకార్యాల్లో, ముస్లింల వివాహాది కార్యాల్లో పాడే పాటల్లో అతని పేరు గానం చేయబడుతుంది. హిందువులు తమ నివాసాల్లో అతన్ని రుషిగా ఆరాధిస్తారు. అలీ బిన్ తైపూర్ బుస్తమి (Ali Bin Taifur Bustami) 1092 A.H. లో గోల్కొండ పతనానికి ఆరు సంవత్సరాలకు ముందు తను సంకల్పించిన చరిత్ర గ్రంథం హదైఖుష్ సలాతీన్ (Hadaiqus Salateen) లో రాజు హసన న్ను చాలా గొప్పగా స్తుతించి, అత్యంత భక్తితో గోల్కొండ రాజ్యం ఎల్లవేళలా శోభాయమానంగా వెలగాలని కాంక్షించాడు.
“ప్రపంచానికే సామ్రాట్టు అబుల్ హసన్ దాతృత్వానికి కృతజ్ఞతలు
అతని రాజ్యంలో, సురక్షిత పాలనలో మేము సుఖంగా గడిపాము
ధర్మానికి బద్దులై వుండే మహనీయులసృష్టి కోసం;
న్యాయానికి బద్దుడు, పవిత్రుడైన రాజు - అభివృద్ధి, భోగఫలాలు పొందాలని
అనేక ఆనందాలు అతనికి స్వంతం కావాలని, భగవంతుడు సదా
అతనికి రక్షకుడిగా వుండాలని
పవిత్రుడైన ప్రవక్త సాక్షిగా నేను ప్రార్థిస్తున్నాను.
అంటూ అభిప్రాయాన్ని వెల్లడిస్తాడు.