ఆలస్యంగానైనా, బయటపడిన కొన్ని రికార్డులను పరిశీలిస్తే, మొఘలులు చిత్రీకరించిన విషయాలను ఛేదిస్తే అబుల్ హసన్ వ్యక్తిత్వం యొక్క వాస్తవికతను అసలు నిజాలను చిత్రించడం అంత కష్టమేమీ కాదు. ప్రజల్లో నిలిచిన నానుడి ప్రకారం "ఒక దిమ్మరిని గోల్కొండ రాజ్యంపై రుద్దడం దురదృష్టవశాత్తు విధిలిఖితమే”. సహజంగానే ఎలాంటి ప్రచారాలు, వదంతాలైనా చివరికి మొఘలులు చేసిన వ్యాఖ్యానాల పైనే నిలబడతాయి. చివరికి ఆసఫ్ జాహీలకాలంలో అనగా: 18వ, 19వ శతాబ్దిలలో లిఖించబడిన చరిత్ర పుస్తకాల్లోనూ గుడ్డిగా మొఘల్ చరిత్ర కారులరాతలే ప్రతి లిఖించబడినాయి. తరువాత వచ్చిన చరిత్రకారులు తప్పుడు వ్యాఖ్యానాలను, ప్రచారాలను తొలగించి నిష్పక్షపాతంగా అబుల్ హసన్ వ్యక్తిత్వం, స్వభావాలచిత్రణ చేసి న్యాయం చేకూర్చాలనే ప్రయత్నం కూడా చేయలేదు.
అబుల్ హసన్ కుతుబ్షా పాలన కాలంలోనే ఔరంగజేబు దక్కన్ దక్షిణ ప్రాంతాలైన గోల్కొండ, బీజాపూర్లపై అలాగే మరాఠాలపై కూలంకషంగా పథకాలు వేసి విజయకాంక్షతో దండయాత్రకు శ్రీకారం చుట్టాడు. ఈ పథకాలు మౌలికంగా బయటికి పూర్వీకులైన అక్బర్-ది-గ్రేట్, జహంగీర్, షాజహాన్లు వేసిన వాటికి కొనసాగింపుగా కనబడినా అంతర్గతంగా ఔరంగజేబు ఉద్దేశం వేరు. ప్రధానంగా వారు బలహీనమైన ఉత్తర, దక్షిణ రాజ్యాలను తమకు అనగా మొఘల్ సామ్రాజ్యానికి విధేయులుగా లొంగి వుండాలన్నది వారి ఆకాంక్ష. కాని ఔరంగజేబు దానికి మరో రంగు పులిమి దిశనే మార్చేశాడు. తమకు విధేయులుగా వారిని లొంగదీసుకోవాలనే విధానం కాస్త మారి దురదృష్టవశాత్తు వారి రాజ్యాలనే స్వాధీనపరుచుకోవాలనే ఆశల చిక్కుముడిలో చిక్కుబడిపోయాడు. ధార్మిక భావనల ముసుగుతో తన దుష్ట పన్నాగాలను నిజం చేసుకోవాలన్న ఆలోచన, దక్కన్ రాజ్యాలకు తీవ్రమైన ముప్పులా మారింది. అలాగే మొఘల్ సామ్రాజ్యానికి విపత్తుకు దారి తీసింది. చక్రవర్తి ధార్మిక భావాలను, విధానాలను ఆచరించడమే కాదు, రాజకీయ, సైనిక (మిలట్రీ) కార్యకలాపాలను కూడా ఖురాన్ సూత్రాలకు లొంగి అనుసరించేవాడు. మరాఠాలకు సంబంధించినంత వరకు వారి వినాశనాన్ని కోరడంలో ఒక నిజమైన ముస్లింగా తన చర్యలు న్యాయసమ్మతమేనని విశ్వసించేవాడు. కాని ముస్లిం రాజ్యాలైన గోల్కొండ, బీజాపూర్ లతో మొఘల్ విధానాలే సందేహాస్పదంగా వుండేవి. కుట్రపూరితమైన పథకాలు, ఇస్లామిక్ సూత్రాలకు విరుద్ధం కావడమే ప్రధాన కారణం. అంతే కాదు, చక్రవర్తి ముస్లిం రాజ్యాలకు విరుద్ధంగా, శత్రుభావనతో వుండడం సరికాదని అప్పటి ప్రసిద్ధ మత