షికన్ ఖాన్, అజీజ్ ఖాన్, సర్బర్హా ఖాన్... వీరి శిబిరాలపై అకస్మాత్తుగా దాడులు జరిపి నష్టపరిచారు. జమీ షీద్ ఖాన్, ముందుగానే కాలికి బుద్ది చెప్పాడు. సలీం ఖాన్, సఫ్ షికన్ ఖాన్, బంకర్లాంటి గుంతల్లో తలదాచుకున్నారు. అజీజ్ ఖాన్, సర్ బర్హా ఖాన్ మొహాలకు బురద పూసుకుని ఎదురయ్యే ఆపద నుండి తప్పించుకున్నారు. ఖైదీలుగా చిక్కిన వారిని నిర్భందంలోకి తీసుకున్నారు. కాని వారితో మర్యాదగానే ప్రవర్తించారు. వృద్ధుడైన చక్రవర్తి ఈ పరిణామాలకు ఏ మత్రం తొణకలేదు. గోల్కొండ రాజ్యాన్ని ముక్కలుగా చీల్చడానికే నిర్ణయించుకున్నాడు. ఇస్లామిక్ న్యాయపరిధుల్లో ముస్లిం రాజ్యాలైన గోల్కొండ, బీజాపూర్లపై ఆక్రమణలు అన్యాయమైనా, వాటిని లెక్క చేయదల్చుకోలేదు. ముస్లిం మత పెద్దలు ధైర్యంగానే వీటి న్యాయబద్దతను ప్రశ్నించారు. దీనికి ప్రతిగా బీజాపూర్, గోల్కొండలు చేసిన దండయాత్రలు న్యాయ సమ్మతమేనా అని ఖాజి షేకుల్ ఇస్లామ్ (Qazi Shaikhul Islam) ని ప్రశ్నించగా, ఖాజీ నిష్పక్షపాతంగా చక్రవర్తికి, ముస్లిం రాజైన అబుల్ హసన్పై దాడి చేయడం ఇస్లాం న్యాయసూత్రాలప్రకారం ఏ మాత్రం సహించేది కాదు అని సమాధాన మిచ్చాడు. ఖాజి నిజాయితీగా తన అభిప్రాయాన్ని చెప్పినందుకు అసంతుష్టుడైన చక్రవర్తి కోరిక మేరకు అతను 'హిజాజ్' మీద హజ్ యాత్రకు వెళ్ళిపోవలసి వచ్చింది. షేకుల్ ఇస్లాం స్థానంలో భర్తీయైన ఖాజీ అబ్దుల్లా కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తపరచడంతో అతన్ని రాజ దర్బారు నుండి తొలగించి అవమానపరచడం జరిగింది.
ఆక్రమణ మొదలై నాలుగు మాసాలకు పైగానే గడిచిపోయింది. అబుల్ హసన్ రెండవ ప్రయత్నంగా అవకాశం తీసుకోదలచి శాంతి ప్రస్తావన కోరుతూ గడిచిన కాలంలో జరిగిన తప్పిదాలకు క్షమాపణలు కోరుతూ, విన్నపాన్ని ఈ కింది షరతులతో పంపించాడు.
"మీరు ఈ కోటలపై విజయం సాధించినచో దీని పాలనా భారాన్ని దయతో ఇతరులకు కాకుండా నాకు అప్పగించగలరని ఆకాంక్షిస్తున్నాను. ఎందుకనగా ఈ రాజ్యం అనేక విషాదాలను, విపత్తులను చవిచూసింది. దీని అభివృద్ధికి అలుపులేని శ్రమ అవసరం. నాకు ఈ నేలతో వున్న సంబంధం, ప్రేమ ఇతరులనుండి ఆశించలేరు. దయతో మీరు తీసుకునే ఈ చర్యకు ప్రతిఫలంగా అధిక మొత్తంలో ధనరాశిని, ఈ రాజ్యాన్ని సందర్శించిన ప్రతిసారీ మీ యాత్రలోని ప్రతి మజిలీకి కోటి రూపాయలు సమర్పించుకోవడమే గాక అదనంగా కోటపై దాడి చేసిన కారణంగా జరిగిన నష్టపరిహారం కింద, నజరానాగా కోటి రూపాయలు ఇచ్చుకుంటానని