Jump to content

పుట:గోల్కొండ చరిత్ర.pdf/252

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చూపడమే గాక ఇస్లామిక్ న్యాయ సూత్రాలను రద్దు చేసి హిందూ ధర్మ సూత్రాలను వర్తింపజేశాడు. 4. రాజ్యంలో జరుగుతున్న అన్ని రకాలఅనైతిక కార్యకలాపాలను, దుష్కర్మలను సహిస్తూ వచ్చాడు. 5. రాత్రి, పగలు తేడా లేకుండా స్త్రీ లౌల్యానికి పాల్పడేవాడు. 6. మరాఠాలతో చేతులు కలిపి వారికి సహకరించినవాడు.

శాంతి ప్రయత్నాలకు భంగపాటు కలగగానే అబుల్ హసన్ ఇక తప్పనిసరి పరిస్థితుల్లో యుద్ధానికి సిద్ధమయ్యాడు. తన దేశ రక్షణకు పూర్తిగా మనసు పెట్టి ఎటువంటి త్యాగానికైనా సరేనని సన్నద్దమయ్యాడు. షార్జాఖాన్, షేక్ మిన్హాజ్, అబ్దుర్ రజ్జాక్ లాడి అలియాస్ ముస్తఫా ఖాన్ లను తాడో పేడో తేల్చుకోవలసిందిగా పూర్తి అధికారాలను అప్పగించాడు. పరిస్థితులు అనుకూలించి సామ్రాజ్యవాదులు లొంగిపోవడానికి సిద్ధపడితే చక్రవర్తిని ప్రాణాలతో బంధించి అతని స్థాయికి తగిన మర్యాద లను అందించాలని సలహా ఇచ్చాడు. 28, జనవరి, 1687 A.D. న విస్తృతమైన తయారీతో, పెద్ద ఎత్తున ఆయుధ సామాగ్రితో మొఘలులు కోటపై దాడి చేశారు. ఆక్రమణ దారులు, 1900 మంది తుపాకీ దారులు (మస్కటీర్లు), 14000 పదాతిదళం, 106 ఫిరంగులు, అందులో 17 వరకు బరువైన గోళాలు నాలుగు నుంచి 40 పేర్లు బరువు గలవాటిని కూడా విసిరి కొట్టగల సామర్థ్యం గలవి కలిగి యున్నారు. 5809 'మౌండ్స్' సూరేకారం (గన్పౌడర్) పొడి, 1244 ఇనుప గోళాలు, 37,500 సంచులు గోతులు పూడ్చడానికి, బారికేడ్లనిర్మాణానికి వెంట తీసుకెళ్ళారు. ఫిరంగి దళానికి పర్షియన్ ఐన సఫ్ షికన్ ఖాన్ (SafShikan Khan) ను పర్యవేక్షణాధికారిగా నియమించడమైనది. ఫిరోజ్ జంగ్ (Feroz Jung) ను కమాండర్-ఇన్-చీఫ్, అతనికి సహాయకుడిగా షా ఆలమ్ను నియమించారు. ఫిరోజ్ జంగ్ తండ్రి ఖాజా ఆబిద్ (Khaja Abid) ప్రముఖ అధికారిగా ముట్టడి కార్యక్రమాల్లో చురుకైన పాత్ర వహించాడు.

ముట్టడి ప్రారంభదశలో చిన్న చిన్న వివాదాల రూపంలో మొదలై దురాశ, కుట్రపూరితంగా మారి యుద్ధం తీవ్రరూపం దాల్చింది. ఫలితంగా 30, 31 జనవరి న అబుల్ మకరిమ్, సయ్యద్ అబ్దుల్లా లాంటి ప్రముఖులు తీవ్రంగా గాయపడ్డారు. రాజ్పుత్ జనరల్స్ కిష్వర్ సింగ్, కిషన్ సింగ్ యుద్ధభూమిలోనే చనిపోయారు. మొఘలులకు కోటలోపలి నుండే గాక, కోట బయట కూడా మోహరించిన నలభైవేలబలమైన సైనిక దళాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. ఖాజా అబిద్ భుజానికి ఒక ఇనుప గోళం బలంగా తాకడంతో మృత్యువు పాలయ్యాడు. షేక్ నిజాం, ముస్తఫా ఖాన్ నేతృత్వంలో బయటనున్న సైన్యం ధాటికి మొఘల్ సేన అనేకమంది