Jump to content

పుట:గోల్కొండ చరిత్ర.pdf/237

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అధ్యాయం-16

మల్కేడ్ యుద్ధం

(The Battle of Malkhed)

ఔరంగజేబు మొఘల్ సామ్రాజ్య సింహాసనాన్ని అధిష్టించి రెండు దశాబ్దాలు గడిచిపోయాయి. కేవలం మొఘల్ సామ్రాజ్యానికి, మరాఠాలకు మధ్య ఒక వైపు, మరాఠాలకు, దక్కన్ సల్తనేట్లకు మధ్య దురాశపూరితమైన యుద్ధాలు తప్ప దక్కన్లో రాజకీయ పరిస్థితులలో చెప్పుకోదగ్గ మార్పులు ఏమీ జరగలేదు. మొఘల్ ల నుండి ఎదురవుతున్న ఎడతెరపిలేని ఆటంకాలను నిలువరించుకుంటూ గోల్కొండ, బీజాపూర్లు తమ సమగ్రతను కాపాడుకోవడానికి తీవ్రమైన సంఘర్షణకు గురవుతూనే వున్నాయి. ఒకవైపు శివాజీ తన ప్రణాళికలను పునర్వీక్షించుకుంటూ కొత్త శక్తిని పుంజుకుని ముందుకు సాగిపోతూనే వున్నాడు. మొఘల్ ఆక్రమణదారులు జయ్ సింగ్, దిలారె ఖాన్, బహదూర్ ఖాన్ కోకల్హాష్ బీజాపూర్ చేతిలో అవమానకరమైన ఓటమిని చవిచూసారు. మల్కేడ్ వద్ద దిలారె ఖాన్ ను, బహ్లోల్ ను గోల్కొండ తరిమివేయగలిగింది. కాని 1680 A.D. (1091 A.H.) లో శివాజీ మరణంతో పరిస్థితి అంతా మారిపోయింది. శివాజీ కుమారుడు శంభాజీ అధికారంలోకి వచ్చాక అకారణంగా చేసే దాడులతో దక్కన్ అల్లకల్లోలానికి గురయ్యింది. ప్రశాంతంగా గడిపే సామాన్య ప్రజల మీద పిడుగు పడినట్లయి ఒకదాని తర్వాత ఒకటిగా కష్టాలు ఎదురుకాసాగాయి. 1681 A.D. (1092 A.H.) లో అభివృద్ధి చెందిన బుర్హాన్పూర్ నగరం దోపిడీలకు గురయ్యి నగర ప్రజలు తీవ్ర కష్టాలపాలయ్యారు. నగర ప్రజలు అందుకు నిరసనగా శుక్రవారపు ప్రార్థనలను నిలిపివేసి చక్రవర్తి తక్షణ సహాయాన్ని ఆర్థించారు. చక్రవర్తి నుండి సహాయం అందకపోయినచో శుక్రవారం ప్రార్థనల సమావేశానికి, హాజరు కాలేమని విన్నవించుకోవడంతో, చక్రవర్తి వెంటనే స్పందించి దక్కన్ ప్రజల దుస్థితి దూరం చేయడానికి తగిన చర్యలకు నిర్ణయించుకున్నాడు.