ఇరాని తన గోడు ఇక్కడ ఎవ్వరూ వినరని నిరాశతో గోల్కొండను వదిలి, తెగిన చేతిని నూనెలో ముంచి మొఘల్ దర్బారులో న్యాయం కోసం ప్రార్థిస్తాడు. చక్రవర్తి అతని పట్ల సానుభూతి చూపించి తగిన న్యాయం చేస్తానని మాటిస్తాడు. ఈ వ్యాఖ్యానాలన్నీ ఆనవాళ్ళుగా వుంటున్నాయే గానీ వాస్తవ పరిస్థితి ఏమిటన్నది అవగాహన లోకి రాలేకపోవడంతో మాదన్నను దోషిగా చూడడం సందేహాలతో, అనుమానాలతో కూడుకున్నది. ఈ వ్యాఖ్యానాలను ఖండించే విధంగా, వివరణలకు విరుద్ధంగా అధికారిక పత్రాలు సాక్ష్యంగా వున్నాయి. బాధితులైన సయ్యద్ లకు " నగదు సహాయం అందించినట్లుగా మాదన్న ద్వారా జారీ చేయబడిన సనలు సాక్ష్యంగా ఇంకా అందుబాటులో వున్నాయి.
మొఘల్ సామ్రాజ్యానికి, మరాఠాలకు, దక్కన్ సల్తనేట్లకు ప్రతిగా మాదన్న అనుసరించిన విదేశాంగ విధానాలు కూడా వివాదాస్పదంగానే వున్నాయి. సిద్దాంత రీత్యా విధానాలు న్యాయసమ్మతంగానే కనబడినా వాటిని అమలు చేసే విధానాన్ని అభినందించలేం. శివాజీ, శంభాజీలతో మైత్రి ఒప్పందాన్ని కుదుర్చుకుని మొఘలులకు వ్యతిరేకంగా పథకాలు వేయడం చాలా తెలివి తక్కువ పని. గోల్కొండ వారి నమ్మకాన్ని మరాఠా నాయకులు గౌరవిస్తూ విశ్వసనీయతను ప్రదర్శించలేదు. గోల్కొండతో కుదిరిన ఒప్పందాలద్వారా మరాఠాలు విస్తృతంగా లాభాలు పొందారు గాని గోల్కొండ రాజ్యానికి అనుకూలంగా తమ బాధ్యతలను గుర్తించి ప్రవర్తించలేదు. ఏ ఒక్క షరతును నెరవేర్చలేదు. మొఘలులు, బీజాపూర్ ను చుట్టుముట్టి నప్పుడు దాని మానాన వదిలివేశారు. మొఘల్ కమాండర్ రెచ్చగొట్టడంతో అకస్మాత్తుగా మాదన్న యుద్ధరంగం నుండి విరమించుకోవడం, వెనుదిరగడం హేయమైన చర్య. ఈ చర్య కేవలం ఆదిల్ షాహిల నైతిక బలాన్ని దెబ్బతీయడమే గాక, కుతుబ్ షాహీల ప్రతిష్టను మంటగలిపింది. బీజాపూర్ పతనం, దక్కన్ పీఠభూమి సమగ్రతకు అంతిమదశగా, చివరికి గోల్కొండ వినాశనానికి దారి వేసే సంకేతంగా నిలిచింది. కొన్ని ఆధారాలను నమ్మగలిగితే మాదన్న ఒకవైపు మొఘల్ ప్రభుత్వం నుండి, మరోవైపు మద్రాస్ లోని 'ఈస్ట్ ఇండియా కంపెనీ' (East India Company) నుండి లంచాలు అంగీకరించేంత వరకు వెళ్ళాడని తెలుస్తుంది.
పాద సూచిక:
1. అటల్లా హుస్సేని (Atallah Hussaini), అడ్వకేట్, డబీర్ పురా, హైదరాబాద్, సంగ్రహకర్త. ప్రముఖ మత పెద్ద, షా హబీబుల్లా పేరు మీద నగదు జారీ చేసిన 'సనద్', ఇతని కలెక్షన్ లొ నున్న ఒక సజీవ సాక్ష్యం. గౌరవనీయమైన సయ్యద్, సూఫీ కుటుంబాలను, మొఘలులు ఆరోపించినట్లుగా పీడనకు, వివక్షకు గురి చేయలేదనడానికి రాజు ఆదేశంతో మాదన్న సంతకంతో జారీ చేయబడిన సనద్ పత్రం ఒక రుజువు.