Jump to content

పుట:గోల్కొండ చరిత్ర.pdf/233

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రంగాలలో సంస్కరణలు ప్రవేశ పెట్టడం వలన రాజ్యం ఎంతో అభివృద్ధి సాధించి, సుభిక్షంగా మారింది. ఎన్ని గుణాత్మక లక్షణాలున్నా, మాదన్నలో వృత్తి పరంగా చూసిన చీకటి కోణాలను విస్మరించలేము. అతని వ్యక్తిత్వం మచ్చలేనిదేం కాదు. అతనిలోని శతృత్వ భావనలు, బలహీనతలు అసంతృప్తికి గురి చేసేవి. విదేశీ యాత్రికులు తమ వ్యక్తిగత, స్వతంత్ర యాత్రా స్మృతి గ్రంథాలలో లిఖించిన విషయాలను పక్కకి తోసి వేయలేం. సామాన్య ప్రజల మానసిక సంవేదనల్ని, తోటి అధికారులు అతని పట్ల పెంచుకున్న ద్వేష భావాన్ని నిర్లక్ష్యపరచలేం. ప్రజల అసంతృప్తి, తోటి అధికారులు ఆరోపణలు, చిలికి చిలికి గాలివానలా మారి, మాదన్న అతని కుటుంబ మర్యాదనే తుడిచి పెట్టేశాయి. మాదన్న లాంటి అత్యున్నత స్థాయిలో వున్న అధికారికి గోల్కొండ చరిత్రలో మునుపెన్నడూ ఎరుగని రీతిలో అవమానకరమైన గౌరవం దక్కింది.

అతని బలహీనతల కారణంగా, మాదన్న దేశభక్తి కూడా ప్రశ్నార్థకమై, సానుభూతి కూడా తగ్గిపోయింది. అతను చూపిన కుహనా దేశభక్తి ప్రాంతీయ పక్షపాతంతో కూడుకున్నదని, రాజ్యంలో స్థిరపడిన విదేశీయుల పట్ల ద్వేష భావంతో వుండే వాడని తెలుస్తుంది. గోల్కొండ రాజ్యం ఉనికిలోకి వచ్చిన ప్రారంభ దశ నుండి కొన్ని వేలమంది తుర్క్ లు, పర్షియన్ లు, మొఘలులు వలస వచ్చి స్థిరపడి కుతుబ్ షాహి ప్రభుత్వం అనుగ్రహంతో ఉద్యోగాలలో చేరి, లేదా తమ వ్యాపార వృత్తుల ద్వారా గోల్కొండ అభివృద్ధికి భాగస్వాములైన విషయం అందరికి విదితమే. కుతుబ్ షాహీల పాలన చివరి దశ వరకు ఈ వలస ప్రవాహం కొనసాగుతూనే వుంది. ఐతే ఈ విదేశీయులు, స్థానికుల మాదిరి దేశం పట్ల విధేయత కాకుండా కేవలం ఆస్తులు సంపాదించుకోవడమే పరమావధిగా ప్రవర్తించే వైఖరి కలిగి యుండటంతో వారి సామాజిక, రాజకీయ వైఖరి పట్ల గోల్కొండ ప్రజలు ఈర్ష్యాసూయలు ప్రకటించేవారు. విదేశీయుల ఆధిపత్యంతో మండిపడిన దక్కనీయులు వారి పెత్తనాన్ని పడకొట్టే సరైన అవకాశం కోసం ఎదురు చూడసాగారు. ఎలాంటి రాజకీయ గొడవలు, గందరగోళం సృష్టించబడిన దానిని సువర్ణావకాశంగా భావించే వారు దక్కనీయులు. కారణం ప్రభుత్వ రక్షణ లేకున్నా వారి మనుగడ కష్టసాధ్యమవు తుందని భ్రమించేవారు. కాని విదేశీయులు తక్షణమే ఎలాంటి చొరబాటుదారులు, ఆక్రమణదారులు దాడులు జరిపినా వాటిని అణిచివేయడం, విషమ పరిస్థితుల్లో ప్రభుత్వానికి అండగా వుండే వారు. విదేశీయులనుండి ఎదురయ్యే చెడు ప్రభావాలను తన సమకాలికుల్లో ఎవరూ చేయని విధంగా జాతీయ భావంతో ఎదుర్కొని వారి ప్రయత్నాలను నీరుగార్చి