రాజధానికి చేరి, రాజు వేసిన పథకాలు, ప్రణాళికలు బట్టబయలయ్యాయి. రాజు హసన్, నలభై వేలసేనను సహాయంగా పంపిస్తున్నాడన్న విషయం వుత్తరాలద్వారా తెలిసి, వాటిని నిలవరించి చక్రవర్తికి అప్పగించారు మొఘలులు. ఇదే సమయంలో మొఘల్ సేన 'షా ఆలం' (Shah Alam) నేతృత్వంలో గోల్కొండ వైపుకు పయనమయ్యింది. బీజాపూర్ పతనం తర్వాత చక్రవర్తి స్వయంగా కుమారున్ని అనుసరించి దాడి ప్రారంభించడానికి సంసిద్ధుడయ్యాడు.
మాదన్న పాత్రపై అంచనా (An Estimate of Madanna's career) :
గోల్కొండ సామాజిక, రాజకీయ జీవితాలపై చెరిగిపోని ముద్ర వేసిన మాదన్న పన్నెండేళ్ళ పాలనా వ్యవహార శైలి, కుతుబ్షాహి చరిత్రలోనే ఒక వివాదాస్పద అంశంగా మిగిలిపోయింది. పరస్పర విరుద్దమైన అభిప్రాయాలు, ప్రతికూల వ్యాఖ్యలమధ్య మాదన్న పాత్రను నిష్పక్షపాతంగా చిత్రీకరించడం, వాస్తవాలను దర్శింపజేయడం చాలా కష్టమే. ఒక మంత్రిగా చరిత్ర అనే న్యాయస్థానం ముందు అతను నేరస్తుడు. చక్రవర్తి అతన్ని “నాస్తికుడని, తాగుబోతు, వ్యభిచారియని, స్త్రీ లౌల్యం కలవాడని, నిరంకుశ భావాలు కలవాడని" అవమానకరమైన, అమర్యాద పూర్వకమైన పదాలతో చిత్రీకరిస్తాడు. మహమ్మద్ సకీ (Mohammed Saqui) మాట్లాడుతూ, మాదన్న, అతని సోదరుడు “అనేక ఆరోపణలు కలిగిన హిందువులు” అంటాడు. ఖఫీఖాన్ మాటల్లో “ఇద్దరు నాస్తికులు గుండె లోతులనుండి అసూయపరులు”. అబూ తురబ్ - "ఇద్దరు బ్రాహ్మణ సోదరులు నేర స్వభావం కలవారు” అంటాడు. గిరిధారి లాల్, మంత్రిని (మాదన్న) ఉద్దేశిస్తూ “మాదన్న బ్రాహ్మణుడు, తెలంగాణ వాసి, దుష్టస్వభావి, వంచన చేయడంలో అతనికి ఎవరూ సాటిరారు" అంటాడు.
మాదన్న మంత్రిగా సాధించిన విజయాలు అనేకం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. రాజు పట్ల, రాజ్యం పట్ల అచంచల విశ్వసనీయత చూపడమే గాక, తన పదవీ కాలంలో సందర్భానుసారంగా కొన్ని తీవ్రమైన తప్పిదాలు, పొరపాట్లు జరిగినా తాను నమ్మిన సిద్ధాంతాలను వదులుకోలేని దృఢనిశ్చయం గలవాడు అన్నది కాదనలేని వాస్తవం. రాజు పట్ల, తన మాతృభూమి పట్ల గాఢమైన దేశభక్తి కలిగినవాడు, తన వృత్తి పట్ల నిజాయితి పాటించేవాడు. చురుకైన రాజనీతిజ్ఞుడు, పరిపాలన దక్షత, అనుభవం, లౌక్యంతో అనుకున్నది సాధించగల నేర్పరి. తన పర్యవేక్షణలో, కేంద్రంలోనే గాక, ప్రావిన్సియల్ యంత్రాంగాన్ని తన నిఘా పరిథిలోకి తెచ్చుకుని పరిపాలనా సామర్థ్యాన్ని పెంచాడు. పారిశ్రామిక, వ్యవసాయిక