Jump to content

పుట:గోల్కొండ చరిత్ర.pdf/224

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వంటి పనులను కొత్త ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గోల్కొండ రాజ్యంలో శాంతి, శ్రేయస్సు, అభివృద్ధి జరగాలంటే రాజ్యంలోని దూరప్రాంతాల జిల్లాలతో కేంద్ర ప్రభుత్వం సంబంధాలు ఏర్పరుచుకుంది. హసన్, మాదన్నలు అధికారం చేపట్టిన తర్వాత రాజ్యం నలుమూలల విస్తారంగా తిరిగి పరిస్థితులను అంచనా వేయసాగారు. ప్రత్యేకంగా కర్నాటక మీద దృష్టి వుంచి వచ్చిపోయే యూరోపియన్ వర్తకుల అవసరాలకనుగుణంగా చర్యలు, ప్రత్యేక శ్రద్ధ తీసుకోసాగారు. మొదటి యాత్ర నవంబర్ 1674 A.D. (1085 A.H.) మొదలై జనవరి 1675 A.D. (1086 A.H.) లో ముగిసింది. రెండవసారి 1676 A.D. (1087A.H.) లో, మూడవసారి 1678 A.D. (1089 A.H.) లో యాత్ర కొనసాగింది. ఆ విధంగా రాజ్యంలోని రాజకీయ, సామాజిక స్థితిగతులపై ప్రథమస్థాయి అవగాహన వచ్చింది. ఔరంగజేబు దర్బారులో వుండి చరిత్ర లిఖించే వ్యక్తి మహమ్మద్ సకీ, అబుల్ హసన్ గురించి రాస్తూ "అతను ప్రతి విషయాన్ని అలుసుగా తీసుకునే వాడని, బాధ్యతలు తప్పించుకుని తిరిగేవాడు, రాజధాని దాటి కనీసం రెండు మైళ్ళ ప్రయాణం కూడా చేయలేని సోమరిపోతు" అని చాలా ఘోరంగా వర్ణిస్తాడు. కాని అతని వర్ణనకు విరుద్దంగా హసన్ విస్తృతంగా తిరిగి సమాచారాన్ని సేకరించేవాడు. స్వయంగా వెళ్ళి యూరోపియన్లు స్థాపించిన వర్తక కేంద్రాలను పర్యవేక్షించి, వాటిపై ప్రత్యేక నిఘా వుంచి, నియంత్రణ వుంచేవాడు. అలా మచిలీపట్నం, మద్రాస్, పులికాట్ ప్రాంతాలపై ప్రత్యేక నిఘా వుండేది. ఫలితంగా కర్నాటక పాలన నేఖ్ నామ్ ఖాన్ పర్యవేక్షణలో సాగిన రీతిలో సక్రమంగా కొనసాగింది. యూరోపియన్ వర్తకులు రాజ్యం చట్టపరిథులకు లోబడి నియంత్రణలో వుండేవారు. ఎలాంటి చట్టవిరుద్దమైన కార్యక్రమాలకు పాల్పడినా, క్రమశిక్షణా రాహిత్యంగా ప్రవర్తించినా స్థానిక అధికారులే కేంద్రం ప్రోత్సాహంతో తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకునేవారు. తూర్పు కనుమల్లో వున్న కొండపల్లి కోట, కొండవీడు కోటలను తనిఖీ చేసి మరమ్మత్తులు చేశారు. కొండపల్లి కోటలో కొంతకాలం అబుల్ హసన్ బస చేసినట్లు తెలుస్తోంది. కొండపైన తను బస చేయడానికి నిర్మించిన రాజమందిరం అవశేషాలు అతని యాత్రకు ఒక జ్ఞాపికగా మిగిలిపోయాయి. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడం, రైతులకు సంక్షేమ పథకాలు, చెరువులు, బావులు తవ్వించడం, కౌలు రైతులనుండి కరువు కాలంలో భూమి శిస్తులు, పన్నులు బలవంతంగా వసూలు చేయకుండా నిర్ణయం తీసుకోవడం, వ్యవసాయ కూలీలకు మద్దతు నివ్వడం, పల్లెప్రాంతాల నుండి వ్యవసాయ కూలీలు వలస వెళ్ళడం లాంటి వాటి మీద