Jump to content

పుట:గోల్కొండ చరిత్ర.pdf/222

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

'మీర్ జుమ్లా'గా నియమిస్తూ వెలువడింది. మాదన్న గౌరవ సూచకంగా సూర్యప్రకాశరావుగా పిలువబడసాగాడు. అక్కన తన సోదరుడి వద్ద పేష్కార్గా నియమితుడయ్యాడు. మూసాబేగ్ ఖాన్ కొత్తగా చేరిన వ్యక్తి సర్ ఖాయిల్ (Sur khail)గా నియుక్తు డయ్యాడు. అధికార దుర్వినియోగం, నిధులదుర్వినియోగం జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా జీతభత్యాల వితరణ, ప్రముఖమైన ఆర్థిక వ్యవహారాల అధికారాలను రాజు తన వద్దనే వుంచుకునే విధంగా సలహానిచ్చారు. ఈ పరిణామాలన్నీ చాలా పకడ్బందీ వ్యవహారంగా, రహస్యంగా, అత్యంత ఆత్మవిశ్వాసంతో, మనో నిబ్బరంతో జరగడం విశేషం. అధికారికంగా ప్రకటించే వరకు ఏ విషయమూ బయటకు పొక్కనీయకుండా జాగ్రత్తపడినారు. సయ్యద్ ముజఫ్ఫర్కు గాని, అతని తొత్తులకు గానీ ఆపద తమపై ముంచెత్తుకొస్తుందన్న సూచనలు ఏ మాత్రం అందలేదు. జరిగిన పరిణామాలతో విభ్రాంతికి గురయ్యారు. అంతేగాదు, రాజు హసన్ దుస్సంఘటనలకు ఏ మాత్రం తొణక్కుండా, శాంత స్వభావంతో సాధారణ విషయాలుగా, రోజువారి కార్యక్రమంగా పరిగణించాడు. సయ్యద్ ముజఫ్ఫర్, అతని కుమారుడు సయ్యద్ హాషిమ్ (Syed Hashim) చివరికి ఉత్తరాదికి తప్పించుకుని మొఘల్ సేవలో చేరిపోయారు. వీరు తప్పించుకుపోవడం కూడా నాటకీయంగా జరిగింది. ముందు జాగ్రత్తగా ముజఫ్ఫర్ను తాత్కాలికంగా నిర్బంధంలోకి తీసుకున్నారు. కాని మొఘల్ హజిబ్ పన్నిన ఉపాయం ఫలితంగా అతను మూటాముల్లె సర్దుకుని ఢిల్లీకి పారిపోయాడు.

మాదన్న:

ఇక మాదన్న విషయానికొస్తే ఇతను హన్మకొండ లోని తెలుగు వారి కుటుంబానికి చెందిన ఖానూజి పంతులు, భాగ్య దంపతులకు కలిగిన నలుగురు కుమారులలో ఒకడు. ఈ నలుగురిలో మాదన్న, అక్కన్న (పెద్దకుమారుడు)లు తమ తెలివి తేటలతో, లౌక్యంతో గుర్తింపు పొందారు. వీరి కుటుంబం గోల్కొండ రాజు సేవలో చాలాకాలం వున్నారని తెలుస్తుంది. మాదన్న అక్కన్నలు ఆనాటి కాలపరిస్థితులకనుగుణంగా మంచి విద్యనే అభ్యసించినారు. అప్పటి గోల్కొండ అధికారిక భాషయైన పర్షియాలో, తెలుగు భాషతో పాటు, నైపుణ్యం కలిగిన వారుగా, రాజ శాసనాలు, అధికారిక పత్రాలు స్పష్టంగా చదివి చేసుకోగల సామర్థ్యం కలిగినవారుగా ప్రసిద్ధి. అతి ముఖ్యమైన విషయాలను అప్పటి నిబంధనలకనుగుణంగా తెల్ల సిరాతో రాసిన చక్రవర్తి ఫర్మానాలు ఎలాంటి ఇబ్బంది లేకుండా మాదన్న చదవగలిగేవాడని తెలుస్తుంది. ప్రత్యేకమైన తెల్ల సిరాతో రాసిన