అధ్యాయం-15
అంతానికి ఆరంభం
(The Beginning of an End)
- అబుల్ హసన్ కుతుబ్ షా దక్కన్ నేలపై 'తానా షా' గా చరిత్రలో ప్రసిద్దికెక్కిన వ్యక్తి. గోల్కొండ రాకుమారితో ఇతని వివాహం, కుతుబ్ షాహి సింహాసనంపై అధిష్టానం సంఘటనలు ఎంత విచిత్రంగా, ఆసక్తికరంగా సాగాయో, అదే విధంగా 1672 A.D. నుండి 1687 A.D. వరకు పద్నాలుగు సంవత్సరాలు సాగిన ఇతని పాలనా కాలం కూడా అసాధారణమైనది, ఆసక్తికరమైనది. గోల్కొండ రాజ్యం ఒకవైపు మరాఠా దాడులతో, మరోవైపు మొఘలుల ఆక్రమణలతో సతమతమవుతున్న సంక్లిష్టదశలో హసన్ రాజ్యభారాన్ని స్వీకరించాడు. దక్కన్ లొ అల్లకల్లోల పరిస్థితి నెలకొన్న సమయం. హసన్ పరిస్థితులను అంచనా వేయగల సమర్థుడు. సమయస్ఫూర్తి, ముందుచూపుగల మేధావి. నగరానికి విసిరివేయబడినట్లు దూరంగా ఓ మూల, గ్రామంలో పుట్టి పెరిగిన వ్యక్తి. రాజదర్బారులో వుండే ఆడంబరాలకు, హడావుడి జీవితాలకు దూరంగా వున్న వ్యక్తి రాజుగా ప్రతిభావంతంగా బాధ్యతలు నిర్వర్తించడం చూసేవాళ్ళకు ఒక వింతైన అనుభవమే. జన్మత: రాజవంశంలో పుట్టిన వారిలాగా హసన్ ప్రవర్తన, రాచకార్యాల నిర్వహణ, రాజ్య పరిపాలన వ్యవహార శైలి వుండేది. రాజకీయ సమ్యక్ దృష్టితో వ్యవహరించే అతని తీరు ఒక విజయవంతమైన రాజులా ఎదగడానికి దారి వేస్తుంది. క్లిష్టసమయాలలో అతను చూపిన ధీరత్వం, మనోస్థిరత్వం చరిత్రలో పోలిస్తే ఎవరూ అతనికి సమవుజ్జీలు లేరు. మొఘలుల జోక్యం, అడ్డు, ఆటంకాలు లేకుండా వుండి వుంటే హసన్ రాజ్యాన్ని ఎంతో అభివృద్ధి చేసే అవకాశాలు వుండేవి. కాని దురదృష్టవశాత్తు ఉత్తర భారతదేశం నుంచి ఉప్పెనలా వచ్చి పడే ఆటంకాలతో దక్కన్ లొ కొనసాగే పాత సాంప్రదాయాలు, పద్ధతులు, విధానాలు తుడిచిపెట్టుకుపోయాయి.