Jump to content

పుట:గోల్కొండ చరిత్ర.pdf/212

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వహిస్తాడు. వీరిద్దరూ ఒకరికొకరు ముందుగానే పరిచయస్తులు. ఒకే దేశం, ఒకే కుటుంబ నేపథ్యం, ఒకే సామాజిక వాతావరణం నుండి వచ్చిన వారగుటచే ఒకరి గురించి మరొకరికి బాగా తెలుసు. సయ్యద్ అహ్మద్ తండ్రి దగ్గర విద్యార్థిగా సయ్యద్ సుల్తాన్ వున్నందున, విచారించగా, ఎలాంటి తడబాటు, సందేహం లేకుండా సయ్యద్ సుల్తాన్ జన్మతః ఉన్నత కుటుంబానికి చెందిన వాడని, సమాజంలో పేరున్న వంశమని, అతని గురించి గొప్పగా చెబుతాడు అహ్మద్. ఈ కారణాలచేత, అహ్మద్న నమ్మి సంతోషంగా తన మూడవ కుమార్తె నిశ్చితార్థం సుల్తాన్ తో చేస్తాడు. సయ్యద్ అహ్మద్, రాజు గారి పెద్దల్లుడు కావడంతో రాజకుటుంబంలో అతని మాటకు విలువ వుండటంతో సుల్తాన్ పెళ్ళి ప్రస్తావన కూడా తెచ్చి పెళ్ళి కార్యక్రమాలను కూడా వెంటనే ప్రారంభించే ఏర్పాట్లు చేస్తాడు. కాని పెళ్ళికి ఒక విఘాతం కలుగుతుంది. ఒక వేళ ఈ పెళ్ళి జరిగిపోయి వుంటే చరిత్ర మరో మలుపు తిరిగేది. అనుకోని విధంగా సయ్యద్ అహ్మద్, సయ్యద్ సుల్తాన్ మధ్య భేదాభిప్రాయాలు రావడంతో ఇద్దరి మధ్య శత్రుత్వం పెరిగింది. దీనికి ప్రధాన కారణం సుల్తాన్, రాజు ఎదుట అహ్మద్ గురించి తక్కువ చేసి మాట్లాడాడు అన్న అభిప్రాయం కలగడమే. ఒక రోజు రాజు అబ్దుల్లా తనకు కాబోయే అల్లుడితో మట్లాడుతూ సయ్యద్ అహ్మద్ కుటుంబ వివరాలు తెలుసుకోవాలనే కోరికను వెలిబుచ్చుతాడు. సయ్యద్ సుల్తాన్ వివరిస్తాడు. తను సయ్యద్ అహ్మద్ను తన గురువు కుమారుడిగానే తెలుసు. అతను మంచి సాంప్రదాయిక కుటుంబానికి చెందిన వ్యక్తి అని అంటాడు. ఐతే అహ్మద్, సుల్తాన్ వివరణను తీసుకుని అతను తన గురించి తక్కువ చేసి మాట్లాడాడు అన్న అభిప్రాయానికి వస్తాడు. తాను ఊహించినంతగా గొప్పగా, వైభవంగా, హుందాగా సుల్తాన్ వివరించలేదని అహ్మద్ అభిప్రాయపడ్డాడు. దానితో అతను సుల్తాన్, రాజుగారి ఎదుట తన గొప్పదనాన్ని ప్రదర్శించుకొనుటకు నన్ను తక్కువ చేసి చులకనగా మాట్లాడినాడన్న అపోహకు గురయ్యాడు. ఈ సంఘటన వారిద్దరి స్నేహం మధ్య పెద్ద అగాధాన్ని ఏర్పరిచింది.

వివాహ కార్యక్రమాల సన్నాహాలు ప్రారంభం కానున్నాయి. ఇద్దరి మధ్య వైరం మరింతగా పెరగసాగింది. సయ్యద్ అహ్మద్ అతని భార్య ఇద్దరూ నిశ్చితార్ధాన్ని రద్దు చేయవలసిందని పట్టుబట్టారు. కాని నిశ్చితార్థమైన వెంటనే పెళ్ళి పనులు ప్రారంభమయ్యాయి. శుభకార్యానికి తేది, సమయం నిశ్చయమైపోయింది. అన్ని సన్నాహాలు పూర్తయ్యాక చివరి దశలో సయ్యద్ అహ్మద్, అతని భార్య ఈ పెళ్ళికి తీవ్రంగా వ్యతిరేకిస్తూ శుభకార్యాన్ని రద్దు చేయకపోతే గోల్కొండను వదలి