Jump to content

పుట:గోల్కొండ చరిత్ర.pdf/197

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లేని పక్షంలో తమ అజేయమైన సేన గోల్కొండను ఆక్రమించుకోక తప్పదని సత్వర ఆదేశాలు జారీ చేసింది 2. హదీదాద్ ఖాన్ (Hadidad Khan), దేవఘడ్ లొ నియమించబడిన మొఘల్ జనరల్ ను వెంటనే ఖందర్ కు పయనమవ్వాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఔరంగజేబు జ్యేష్ట పుత్రుడు మహమ్మద్ సుల్తాన్, నాందేడ్ (Nanded)కు 26 డిసెంబర్, 1655 A.D. (1066 A.H.)న బయలుదేరాడు. ప్రిన్స్ (Mohd. Sultan)కు హైదరాబాద్ లొ ప్రవేశించి 'మీర్ జుమ్లా' సయీద్ అతని కుటుంబ సభ్యుల విడుదలకు ప్రయత్నించమని ఆదేశాలు అందాయి. ప్రిన్స్ నాందేడ్ చేరుకుని రాజు అబ్దుల్లాకు చక్రవర్తి ఆదేశాలసారాంశం పంపించాడు. అమీను, అతని కుటుంబ సభ్యులను విడుదలచేయాల్సిందిగా చక్రవర్తి ఆదేశమని, లేని పక్షంలో మొఘల్ సేన గోల్కొండ రాజ్యంపై దండెత్తక మానదు అని వర్తమానం పంపిస్తాడు.

అబ్దుల్లా లాంటి రాజుకు నిజానికి ఇదొక ఇబ్బందికరమైన పరిస్థితి. రాజు ఏం చేయాలో ఎటూ తోచని ఒక సందిగ్ధావస్థలో ఇరుక్కున్నాడు. మహమ్మద్ అమీన్ ను, అతని బలగాన్ని చక్రవర్తి ఆదేశాలకు తలవొగ్గి విడుదలచేస్తే, తన వ్యక్తిగత ప్రతిష్టయే గాక దేశ ప్రతిష్టకు తీవ్రమైన భంగం వాటిల్లుతుంది. ప్రభుత్వ యంత్రాంగానికి ఆటంకం కలుగుతుంది. అలాగని చక్రవర్తి ఆదేశాలను తోసి పుచ్చితే పరిణామాలు తీవ్రంగా వుంటాయి. విచారించదగిన విషయమేమిటంటే మొఘల్ ప్రభుత్వం కూడా దీన్నొక ప్రతిష్టగా తీసుకోవడంతో సమస్య మరింత జటిలమైంది. రాజు అబ్దుల్లా మౌనంగా వుండి కాల యాపన చేయసాగాడు. మహమ్మద్ సుల్తాన్ 10 జనవరి 1656 A.D. న నాందేడ్ నుండి బయలుదేరి కొన్ని రోజుల తర్వాత హైదరాబాద్ చేరుకున్నాడు. అతని వెనకాలే ఔరంగజేబు హైదరాబాద్ బయలుదేరాడు. పరిస్థితి మరింత తీవ్ర రూపం దాల్చడంతో మరోదారి లేక రాజు మహమ్మద్ అమీను, అతని సహచర బంధువర్గాన్ని వెంటనే విడుదలచేశాడు. విడుదల అయిన వెంటనే వారు హైదరాబాద్కు 24 మైళ్ళ దూరంలో విడిది చేసిన విముక్తి సేన (Liberation army)తో కలిసి పోయారు. బందీలవిముక్తియే మొఘల్ ప్రధాన ఉద్దేశమైతే అక్కడే తమ సేనను నిలిపి వేసేవారు. కాని అలా కాకుండా మహమ్మద్ సుల్తాన్ కు హైదరాబాద్ చేరుకోవడానికి ఆదేశాలు అందాయి. ప్రిన్స్ సుల్తాన్ 23 జనవరిన హైదరాబాద్ చేరుకుని హుసేన్ సాగర్ సరస్సు సమీపంలో మకాం వేశాడు. రెండు రోజులపిమ్మట పరిసరాలు కుదరక ఆ స్థానాన్ని వదిలి మరో చోటికి తన క్యాంపు మార్చాడు. అబ్దుల్లా ఒక రోజు ముందే నగరాన్ని వదిలి కోటలో వుండిపోయాడు. ఫలితంగా నగరానికి రక్షణ లేకుండా పోయింది. దోపిడీ దారులు చెలరేగిపోయారు.