ఘోర పరాజయాన్ని చవి చూడడంతో సామ్రాజ్యాధీశుని ప్రతిష్ట మరింతగా దిగజారింది. ఫలితంగా దక్కన్ రాజులు ఒప్పందం ప్రకారం చెల్లించాల్సిన కప్పం నిలిపివేశారు. చూసీ చూడనట్లు వదిలేశారు. ఇటువంటి అననుకూల పరిస్థితుల్లో చక్రవర్తికి గవర్నర్ ను మార్చక తప్పలేదు. 1653 A.D. (1064 A.H.) లో మరోసారి ఔరంగజేబును దక్కన్ వ్యవహారాల పర్యవేక్షణకు పంపడం జరిగింది. కాని ఈ సారి పదవీ బాధ్యత స్వీకరణ సమయంలో ఎలాంటి విశిష్టమైన స్వాగత సత్కారాలు జరగలేదు. కాని వ్యవసాయిక క్షేత్రంలో చెప్పుకోదగ్గ సంస్కరణలు మాత్రం ప్రముఖంగా జరిగాయి. ఔరంగజేబు దక్కన్ రాజులకు జరిగిన నష్టాలను భర్తీ చేసే విధంగా, రాజకీయ సంబంధాలు మెరుగుపడే విధంగా చర్యలు తీసుకోసాగాడు. ఒప్పందం ప్రకారం అన్ని షరతులను సక్రమంగా నిర్వహిస్తూ పరిపాలనను ఒక గాడిలో పెట్టగలిగాడు కాని దురదృష్టవశాత్తు గోల్కొండ, బీజాపూర్ రాజులతో తన ప్రవర్తన స్నేహ పూరితంగా వుండకపోయేది. విచక్షణా రహితంగా దూకుడుతనంతో ప్రవర్తించేవాడు. ఈ ఇద్దరు రాజులతో సక్రమంగా వ్యవహరించడానికి సుముఖత చూపేవాడు కాదు.
దురాశాపరుడైన వైస్రాయ్ (ఔరంగజేబు) గోల్కొండ, బీజాపూర్ రాజ్యాలపై విరుచుకుపడటానికి అనేక కారణాలు వెతికేవాడు. గోల్కొండపై నమ్మకద్రోహం మోపాడు. ఒప్పంద షరతులను ఉల్లంఘించారని దోషిగా నిలబెట్టాడు. వార్షిక కప్పం రెండు లక్షలహున్స్ చెల్లించకపోవడమే కాక తిరిగి పర్షియన్ దర్బార్తో గోల్కొండ రాజు సత్సంబంధాలు ఏర్పరచుకున్నాడు. ఇవన్నీ గోల్కొండకు శాపమయ్యాయి. 1653 A.D. లో దక్కన్లో పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే వైస్రాయ్ బకాయిలు చెల్లింపులపై ఒత్తిడి తెచ్చాడు. గోల్కొండ హున్స్, మొఘల్ (రూపాయి) కరెన్సీకి మధ్య వున్న ఎక్స్చేంజ్ రేట్ మధ్య వున్న తేడాను కూడా భర్తీ చేయవలసిందిగా ఆదేశించాడు. విలువరేటు హుక్కు, రూపాయికి నాలుగు నుండి ఐదు రూపాయలు తేడావుండేది. మరోవైపు చంద్రగిరి రాజు శ్రీ రంగరాయలు ఫిరాయింపు దారుగా మారాడు. శ్రీరంగ రాయలు, గోల్కొండకు పాలెగాడుగా (సామంతుడిగా) వుంటూ మొఘల్ సహాయాన్ని, రక్షణను కోరాడు. అందుకు ప్రతిఫలంగా యాభై లక్షల హున్స్, రెండు వందల ఏనుగులు, విలువైన రత్నాలు, వార్షిక కప్పం, అనేక బహుమతులను చెల్లిస్తానని ఆశ పెట్టాడు. ప్రస్తావన ఆకర్షణీయంగా వుండటంతో కాదనలేకపోయారు. బహుమతులకు ఆశపడి వైస్రాయ్ కూడా చక్రవర్తికి శ్రీ రంగరాయలు కు అనుకూలంగా గట్టి సిఫారసును చేశాడు.