Jump to content

పుట:గోల్కొండ చరిత్ర.pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జయించి కలుపుకున్న ప్రాంతాలను తిరిగి వెళ్ళేటప్పుడు గోల్కొండకు అప్పగించేందుకు మాటిస్తాడు. బదులుగా మిలట్రీ చర్యలకు లక్ష హున్స్, రోజుకు మూడువేలహున్స్ దినసరి ఖర్చులకు ఇవ్వవలసిందిగా కోరతాడు. ఒప్పందాలన్నీ రాజకీయ ఉద్దేశంతో సాగినవి.

గోల్కొండ రాజుకు, అతని మంత్రి మాదన్న ఈ ఒప్పందానికి చూపిన ఉత్సుకతకు ప్రధాన ప్రేరణ కేవలం మొఘలుల దుందుడుకు తనాన్ని నిలవరించి వారి నుండి కర్నాటకను కాపాడుకోవడమే. అప్పటి మీర్ జుమ్లా (ఆర్థిక మంత్రి)మహమ్మద్ సయీద్ చేసిన నమ్మక ద్రోహం, మొఘల్ల జోక్యంతో రాజ్యం ఇదివరకే కుప్పకూలే స్థితికి చేరింది. ఈ విషాదం అంతటితో ఆగలేదు. 'మీర్ జుమ్లా' జయించిన ప్రాంతాల మీద మొఘల్ ప్రభుత్వం తన ఆకలిగొన్న చూపును ప్రసరించింది. అందుకే గోల్కొండ ఈ విపత్తును ఒంటరిగా ఎదుర్కోలేక ఎటువంటి ధైర్యం చేయలేకపోయింది. ఈ సందర్భంలో శివాజీని నమ్ముకుని అతనితో ఒప్పందాలను కుదుర్చుకుంది.

కాని దురదృష్టవశాత్తు ఈ ఒప్పందాలు గోల్కొండకు అనుకూలంగా వుంటాయని భావించిన వారికి నిరాశ మిగిలింది. ఒప్పందాలను, ప్రమాణాలను తుంగలో తొక్కి శివాజీ ఏ ఒక్కటి నెరవేర్చకుండటమే గాక, గోల్కొండకు సహకరిస్తానని అపారమైన ధనరాశిని తీసుకుని, చేస్తానన్న సహాయం కూడా చేయలేదు. మైసూర్ పీఠభూమిలో అనేక క్షేత్రాలపై విజయం సాధించాడు. ఆదిల్ షాహి జనరల్స్ నజీర్ మహమ్మద్, షంషాద్ ఖాన్ గట్టి పోటీ ఇచ్చినా 'గింజ' ని కూడా ఆక్రమించు కున్నాడు. ఈ కాలంలో శివాజీ సాధించిన విస్తారమైన ప్రాంతాలలో దాదాపుగా వందకోటలు వుంటాయని చరిత్ర కారుల అంచనా. ఈ ప్రాంతాలు వజ్రాలగనులకు ప్రసిద్ధి కావడంతో నలభై లక్షలహున్స్ వరకు రెవిన్యూ ఆదాయాన్ని మరాఠాలు పొందగలిగారు. ఒప్పందం ప్రకారం కనీసం ఒక్క కోటను కూడా గోల్కొండ రాజ్యానికి అప్పజెప్పలేదు. జరిగిన నష్టాన్ని సరిదిద్దుకునే ప్రయత్నంగా కుతుబ్ షాహి ప్రభుత్వం ఏ మాత్రం కాలయాపన చేయకుండా 'గింజ' పైకి మహమ్మద్ ఇబ్రహీంను, మైసూర్ పీఠభూమిపై లింగప్పను పంపించగా, కుతుబ్షాహీ సేన, వారు అనుకున్న లక్ష్యాన్ని సాధించకపోగా చివరికి ప్రయత్నంలో విఫలమయ్యారు.