Jump to content

పుట:గోల్కొండ చరిత్ర.pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సుంకాన్ని వసూలు చేసేవారు. అదే విదేశీ సరుకులపై ఎలాంటి పన్ను వుండకపోయేది. అందుకు లింగప్ప, వెంటనే మద్రాసుకు చేరే దారులన్నీ దిగ్బంధనం చేయగా వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఫలితంగా కంపెనీ నిస్సహాయ స్థితికి వచ్చి ఏమీ చేయలేని పరిస్థితిలో గవర్నర్ ఆదేశించిన నిబంధనలను అనుసరించక తప్పలేదు. స్ట్రెన్ షమ్ మాస్టర్ ఆధ్వర్యంలో కంపెనీ కవ్వింపు చర్యలకు పాల్పడసాగింది. 1677 A.D. (1088 A.H.)లో కంపెనీ St.George కోట మరమ్మత్తులకు కారణం చూపుతూ స్థానిక వర్తకులమీద పన్ను (levy) లెవి విధించింది. నగరానికి చెల్లించాల్సిన అద్దె గవర్నర్కు కాదని ప్రత్యక్షంగా కేంద్ర ప్రభుత్వ ఖజానాలో జమ చేయసాగింది. ఫలితంగా ఉద్రిక్తతలు మరికాస్త అధికమయ్యాయి. ఉత్పన్నమైన ఉపద్రవాలను పరిష్కరించే క్రమంలో గవర్నర్ మరోసారి నగర దిగ్బంధనం చేశాడు. కంపనీ క్షమాపణలు చెప్తూ నిబంధనలకు తలవొగ్గింది. గవర్నర్ పదవిని తక్కువ చేస్తూ అవమానపరిచే విధంగా కంపెనీ తెలివిగా మరో ఉపాయం ఆలోచించింది. గవర్నరు బేఖాతరు చేస్తూ కేంద్రంతో ప్రత్యక్ష సంబంధాలు నెలకొల్పుకునే ప్రయత్నాలు కొనసాగించింది. అయినప్పటికి కేంద్రం కంపెనీ విజ్ఞాపనను తిరస్కరించడమే గాక, గవర్నర్ కు మద్దతుగా అతని పాలనా విధానాలను ప్రోత్సహించి వెన్ను తట్టింది. 1682 A.D. (1093 A.H.)లో అతని గవర్నర్ పదవికి ఉన్నతి కల్పిస్తూ పూర్తి కర్నాటక ప్రావిన్సుకు గవర్నర్ను సంప్రదించి ఉత్తర ప్రత్యుత్తరాలు అతని ద్వారా పంపించాల్సినదిగా ఆదేశాలు జారీ చేసింది. లింగప్ప స్థానంలో 1686 A.D. (1098 A.H.)లో గవర్నర్ గా అబ్దుల్ నబి (Abdul Nabi) పదవి బాధ్యతలు స్వీకరించినా ఇతను కూడా లింగప్ప నిర్దేశించిన విధానాలనే కొనసాగించాడు. పాలనా పరంగా కఠినమైన చట్టాలను విధించి ఆచరించడంతో ఆంగ్లేయులను, డచ్ కంపెనీలను నియంత్రించడం సులభతరమై మంచి ఫలితాలు ఇచ్చింది. రాష్ట్రం విధించిన చట్టాలను ఉల్లంఘించడానికి వారికి అవకాశం చిక్కలేదు. 1685 A.D. (1097 A.H.)లో మొఘలులచేతిలో కుతుబ్ షాహి సేన పరాజయాన్ని చవిచూసిన సందర్భంలో ఇంగ్లీష్, డచ్ వర్తకులు అవకాశాన్ని ఆసరాగా చేసుకుని మచిలీపట్నం ఆక్రమించుకునే విఫలయత్నం చేశారు. అలాగే చెల్లిస్తున్న అద్దెను నిలిపివేయాలన్న ప్రయత్నం కూడా నీరుకారిపోయింది.