Jump to content

పుట:గోల్కొండ చరిత్ర.pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యాభై వేల రూపాయల విలువతో అద్భుతమైన పనితనంతో చేయబడివున్నది. అబ్దుల్ లతీఫ్ కు, నగల వర్తకుడైన నిహాల్ చంద్ (Nihal chand), గోల్కొండ రాజు వద్ద వున్న ఈ నగ విశిష్టతను వివరించగా, చక్రవర్తి మర్యాద పూర్వకంగానే ఈ ఆభరణాన్ని కోరడమైనది. అసలు విషయానికొస్తే అబ్దుల్ లతీఫ్, రాయబారితో పాటు నగల వర్తకుడు నిహాల్ చంద్ ను పంపించడం అసలు వుద్దేశం, గోల్కొండ రాజు ఇచ్చే నగల విలువను అంచనా వేయడం. వర్తమానం అందుకునే సమయంలో రాజు అబ్దుల్లా చేతి వేలికి వున్న వుంగరంలో విలువ కట్టలేని ఒక కెంపు (రూబి), ఆకర్షణీయమైన పరిమాణం, రంగు, మెరుపుతో వుండేది. ఆ వుంగరాన్ని కానుకగా సమర్పించమని కోరగా ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో వారి కోరికకు తలవొగ్గక తప్పలేదు. చక్రవర్తి ఆ నగను చూసి ఎంతో ఆనందించాడు. కృతజ్ఞతా పూర్వకంగా రాజు అబ్దుల్లా రాసిన ఉత్తరం లోని సారాంశం :

"ఈ వినతి పత్రం చక్రవర్తికి విధేయుడైన సేవకుడు, భక్తుడు, కుత్బుల్ ముల్క్ ద్వారా మనః పూర్వక నివాళీలు అందజేస్తూ, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఘనమైన సామ్రాజ్యాధీశుడికి ప్రార్థనతో విన్నవించునది... ఘనమైన, శోభాయమైన యోధ అందించిన ప్రతి పదం అందులోని అర్థవిశేషణం మాపై అనుకూలతను దర్శింపజేసింది. ప్రతి అక్షరంలో రాజసం వుట్టిపడింది. గౌరవనీయులైన ఖాజా జహిద్ ద్వారా అందించబడిన 'చెరిగిపోని పట్టిక'లా సువర్ణ చట్రంలో సామ్రాజ్యాధిపతి చిత్రపటం మనోరంజకమై అనంతమైన ఆనందాన్నిచ్చింది. మా ప్రతిష్టను ఆకాశానికెత్తింది. ఆకార పరిమాణాలలో అద్భుతంగా వున్న ఏనుగు అసాధారణమైన కానుక. ఇతర ఉత్కృష్టమైన, విలువైన కానుకలు... మా గౌరవాన్ని మరింతగా పెంచాయి. మీరు మాపై కురిపించిన అవ్యాజమైన అనుగ్రహానికి మేము దానికి సరితూగే కృతజ్ఞతలు చూపడం మా స్థాయికి మించిన పని.... నేను నా విధేయతను ప్రదర్శించకుండా కృతఘ్నుడనై ప్రవర్తించే సాహసం చేస్తే అల్లాహ్ నన్ను క్షమించడు...