Jump to content

పుట:గోల్కొండ చరిత్ర.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దక్కన్ పీఠభూమి భారత ఉపఖండంలోని భాగమైనప్పటికీ, దక్కన్ తనదైన అస్తిత్వాన్ని, ప్రత్యేకతలను, నిలుపుకుంటూ ఒక స్వతంత్ర ప్రతిపత్తిని ప్రకటించుకున్నది. ప్రతాపరుద్రుడు-II మరణించిన తర్వాత దక్షిణ భారత దేశంలో మహమ్మదీయ రాజుల పాలన ఉనికిలోకి వచ్చింది. భారత దేశం దక్షిణ భూభాగం, ఢిల్లీ సుల్తానుల ఆధీనం లోకి వచ్చిన మాట వాస్తవమైన, వారి పాలనా యంత్రాంగం కేవలం పర్యవేక్షణాపరంగానే సాగడంతో అవకాశం చిక్కిన ప్రతిసారి స్థానిక పాలకులు స్వతంత్రంగా ప్రవర్తించేవారు. ఉదాహరణకు, హాసన్ గంగు బహమన్ షా స్వయంగా బహమనీ సామ్రాజ్యానికి రాజుగా ప్రకటించుకొని పాలన సాగించాడు. కాలక్రమంగా, బహమనీ సామ్రాజ్య క్షేత్ర పరిధి ఐదు భాగాలుగా విడిపోయింది; అందులో ఒకటి గోల్కొండ.

బహమనీ రాజు ద్వారా గోల్కొండకు గవర్నర్గా పంపించబడిన సుల్తాన్ కులీ కుత్బుల్ -ముల్క్, 1538 A.D. లో స్వతంత్రతను ప్రకటించుకొని కుతుబ్ షాహి వంశాన్ని స్థాపించాడు. కుతుబ్ షాహీలు, దాదాపుగా రెండు వందల సంవత్సరాలు గోల్కొండను పాలించారు. చివరికి ఔరంగజేబు గోల్కొండ పై దాడి చేసి మొఘల్ సామ్రాజ్యంలో విలీనం చేసాడు.

సాధారణంగా చక్రవర్తుల వంశాల పేరుమీదుగా పాలన జరగడం, చరిత్రలో ఆయా కాలాలు ఆ విధంగానే గుర్తింపు పొందడం, చరిత్ర రచనకు చరిత్రకారులకు మూలంగా నిలబడడం సంప్రదాయం. కానీ దక్కన్ పీఠభూమి దక్షిణ భారతంలోని దాదాపు రెండు శతాబ్దాల పైగా చరిత్రకు సమానార్థకంగా గోల్కొండ కోట పేరుతో ప్రస్తావించబడడం విశేషం. అలాంటి విశిష్టతను సాధించిన గోల్కొండ పాలనలో గోల్కొండ కోటను రాజధానిగా చేసుకొని మొత్తం ఎనమండుగురు చక్రవర్తులు పాలించారు అనేది మనకు తెలుస్తుంది.

నిజానికి 1512లో బహమనీ రాజ్యం ఐదు స్వతంత్ర రాజ్యాలుగా విడిపోయిన తర్వాత, తెలంగాణా ప్రాంతం సుల్తాన్ కులీ కుతుబ్ షాహీ గోల్కొండ రాజ్యాన్ని స్థాపించారు. అయితే పూర్తి స్థాయిలో మాత్రం 1518 నుండే కుతుబ్ షాల ఏలుబడి మొదలయింది. అలా తెలంగాణా ప్రాంతం కులీ కుతుబ్ ఉల్ ముల్క్ (1518-1543), జంషీద్ కులీ (1843-50), సుభాన్ కులీ (1550), ఇబ్రాహీం కులీ (1550-1580), మహ్మద్ కులీ (1580-1612), సుల్తాన్ మహ్మద్ కుతుబ్ షా (1612-26), అబ్ధుల్లా కుతుబ్ షా (1626 -1672), అబుల్ హాసన్ తానిషా (1672-1687)ల పాలనలో కొనసాగింది.

ఈ చక్రవర్తులు తమ తమ రంగాలలో చేపట్టిన సంస్కరణలు, అమలు చేసిన విధానాలు చరిత్రలో నిలిచిపోయాయి. తెలంగాణ చరిత్ర ప్రస్థానంలో ముస్లిం చక్రవర్తుల పాలనకు బలమైన పునాదులు వేసి, నాటి దక్కనీ తెలంగాణాలో సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, మతపరమైన ఎన్నో పరిణామాలకు ఆలంబనగా నిలిచాయి.